inister KTR Meet Ponnala Lakshmaiah : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో బీఆర్‌ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్.. పలువురు బీఆర్‌ఎస్ నేతలు వెళ్లారు. పొన్నాలతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్‌ఎస్‌లోకి (Ponnala to be Join in BRS) ఆహ్వానించడానికి వచ్చానని తెలిపారు. పార్టీలో చేరడానికి పొన్నాల సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.
పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన రేపు సీఎం కేసీఆర్‌ను కలిసి... తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్‌కు పొన్నాల ఎంతో సేవ చేశారన్న కేటీఆర్.. ఇంతటి సీనియర్లకు కనీసం అపాయింట్‌మెంట్, గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బలహీన వర్గాల నేత పొన్నాలను రేవంత్‌రెడ్డి తూలనాడిన విధానం దిగజారుడు సంస్కారానికి నిదర్శనం అని విమర్శించారు. పొన్నాలను కాంగ్రెస్ నిరాదరించినా.. తాము వారిని ఆహ్వానిస్తామన్నారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు కేసు దొంగను కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. ఆహ్వానాన్ని మన్నించి పొన్నాల తమ పార్టీలో చేరతారనే విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పొన్నాల.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత అన్ని విషయాలు వివరిస్తారని తెలిపారు.
"బలహీన వర్గాల్లో బలమైన గొంతు కలిగిన పొన్నాల లక్ష్మయ్యను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడానికి మా పార్టీ అధ్యక్షుల సూచన మేరకు వచ్చాం. వారు పార్టీలోకి రావాలని.. వారికి సముచిత స్థానాన్ని.. ప్రాధాన్యతను బీఆర్‌ఎస్ కల్పిస్తుందని వారిని రేపు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి 16వ తేదీన జనగామ క్షేత్రంలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరమని అడిగాం. వారు సుముఖత వ్యక్తం చేశారు." - కేటీఆర్, మంత్రి