తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR in Harvard India Conference: తెలంగాణ విధానాలు దేశవ్యాప్తం కావాలి: కేటీఆర్​

KTR in Harvard India Conference: దేశంలో ఉన్నవనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే భారతదేశం పురోగతి ఆపడం ఎవరి తరం కాదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. "2030 నాటికి భారతదేశ అభివృద్ధి" అనే అంశంపైన హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ దృశ్యమాద్యమం ద్వారా మాట్లాడారు. భారత్​ అభివృద్ధి మరింత వేగవంతంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

KTR in Harvard India Conference: తెలంగాణ విధానాలు దేశవ్యాప్తం కావాలి: కేటీఆర్​
KTR in Harvard India Conference: తెలంగాణ విధానాలు దేశవ్యాప్తం కావాలి: కేటీఆర్​

By

Published : Feb 21, 2022, 5:33 AM IST

KTR in Harvard India Conference: 'ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో అతిపెద్ద దేశంగా భారత్‌ ఉన్నప్పటికీ.. బంగ్లాదేశ్, శ్రీలంక కన్నా తక్కువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తుంది..? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ధరల కన్నా దేశంలో తయారుచేసే మెడికల్ పరికరాల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి..? ఇందుకు అడ్డుగా ఉన్న విధానాలు ఏంటీ? ఇండియా కన్నా అతి చిన్న దేశాలైన వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి? ఇందులో భారత్​ను అడ్డుకుంటున్న పరిస్థితులు ఏంటీ? దేశంలోని నదుల నిండా నీళ్లు పారుతున్నప్పటికీ.. బీడు భూములు ఎందుకున్నాయి? కరవు పరిస్థితులు ఎందుకు ఉన్నాయి..?' అన్న ప్రశ్నలకు దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉందని హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. "2030 నాటికి భారతదేశ అభివృద్ధి" అనే అంశంపైన హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ దృశ్యమాద్యమం ద్వారా మాట్లాడారు.

ప్రాథమిక కార్యక్రమాలతోనే..

భారతదేశం, చైనా జీడీపీ 35 ఏళ్ల క్రితం సమానంగా ఉన్నప్పటికీ.. ఈ రోజు చైనా అనేక రంగాల్లో చాలా ముందు వరుసలో ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. సరైన పరిపాలనా విధానాలు, ప్రాధాన్యతలు, భవిష్యత్తుకి అవసరం అయ్యే విప్లవాత్మకమైన సంస్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలకు సిద్ధంగా ఉండేలా మౌలిక వసతుల కల్పన చేయడం వంటి కొన్ని ప్రాథమిక కార్యక్రమాలను చేపడితే దేశ పురోగతి మరింత వేగంగా ముందుకుపోతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ..

దేశంలోనే అతి చిన్న నూతన రాష్ట్రం తెలంగాణ అని.. గత ఏడేళ్లలో అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పే విధంగా ముందుకుపోతుందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ మొదలుకొని తర్వాత కాలంలో వచ్చిన టీఎస్​బీపాస్, నూతన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలు, నూతన విధానం ద్వారా ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ వంటి అనేక అద్భుతమైన సంస్కరణలు ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధిలో ముందువరుసలో నిలిపేందుకు దోహదం చేస్తున్నాయన్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపైన దేశంలోని ఏ రాష్ట్రం, స్వతంత్ర భారత చరిత్రలో ఆలోచించని స్థాయిలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం, వ్యవసాయ రంగంలోని మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, టీఎస్ ఐపాస్, పట్టణ ప్రకృతి వనాల వంటి కార్యక్రమాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు స్ఫూర్తి తీసుకొని, తమ తమ రాష్ట్రాల్లో ప్రారంభించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. పారిశ్రామిక రంగం, ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో తెలంగాణ అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రోత్సాహం వలన తెలంగాణలో వ్యవసాయం పరిఢవిల్లే పరిస్థితి నెలకొందన్నారు.

ఇండియా అభివృద్ధి అప్పుడే సాధ్యం..

దేశం తన బలమైన మానవ వనరులు, థింక్​ఫోర్స్​ని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల నిర్మాణంలో భారీగా ఆలోచించినప్పుడే ఇండియా అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారతదేశం నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉందని ఈ దిశగా ఇన్నోవేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్, వీహబ్, అగ్రిహబ్ వంటి ఇంకుబేటర్లపై సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను భారతదేశం స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్లినప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం ఆవిర్భవించే అవకాశం పుష్కలంగా ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచించింది ఆ తర్వాత భారతదేశం ఆలోచిస్తుందన్న నానుడి ఉండేదని... ప్రస్తుతం తెలంగాణ ఆలోచించింది, రేపు ఇండియా ఆలోచిస్తుంది.. అన్న విశ్వాసం తనకు ఉందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: KTR Letter To Central Minister: 'బయ్యారంపై కేంద్రానిది తుక్కు సంకల్పం'

ABOUT THE AUTHOR

...view details