ప్రస్తుతం దేశంలో తెలుగు సినిమా హవా కొనసాగుతోందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే కంటెంట్ ఉన్న చిత్రం పాన్ ఇండియా అయినప్పుడు.. కంటెంట్ ఉన్న సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు పాన్ ఇండియా లీడర్ కాలేడా అని కేటీఆర్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే యువ దర్శకులు, రచయితల కోసం ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత దశరథ్ రచించిన కథా రచన పుస్తకాన్ని కేటీఆర్ లాంఛనంగా ఆవిష్కరించారు.
దేశంలో ప్రస్తుతం తెలుగు సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ ఉన్న సినిమా పాన్ ఇండియా చిత్రం అవుతోంది. కంటెంట్ ఉన్న కేసీఆర్ పాన్ ఇండియాకు వెళ్లలేరా? కంటెంట్ ఉంటే ఎవరైనా పాన్ ఇండియా లీడర్ అవుతారు. ప్రపంచస్థాయి భారతీయ సినిమాలకు హైదరాబాద్ వేదికగా మారాలి. - మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, హరీశ్ శంకర్, నాగ్ అశ్విన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కథా రచన పుస్తకాన్ని ముద్రించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అభినందనలు తెలిపిన కేటీఆర్.. భారత అంతర్జాతీయ చిత్రాలకు హైదరాబాద్ హబ్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.