KTR Inaugurated Osmansagar park: భాగ్యనగరవాసులకు ఖాళీ సమయాల్లో సేదతీరేందుకు అనువుగా.. అందమైన, ఆహ్లాదకర పార్కులను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. విశ్రాంతి కోసమే కాకుండా సమావేశాలు.. వేడుకలు నిర్వహించేందుకు వీలుగా నిర్మిస్తోంది. ఉస్మాన్‌సాగర్ గండిపేట వద్ద సుందరమైన ఉద్యానవనం నేటి నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ఉస్మాన్‌సాగర్ చెరువును ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవనాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. జలాశయం అందాలను ఉద్యానవనం నుంచి వీక్షించడం సరికొత్త అనుభూతి అందించనుంది.
ఉస్మాన్‌సాగర్ వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ఐదున్నర ఎకరాల్లో రూ.35 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. సుందర జలాశయం అందాలను ఆహ్లాదకర వాతావరణం మధ్య చూడటం నగరవాసులకు కనువిందు చేయనుంది. గండిపేట వచ్చే సందర్శకులకు ఈ పార్కు ఏర్పాటుతో మౌలిక వసతుల కొరత తీరినట్లయింది. ఎంట్రెన్స్ ప్లాజాతో పాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పాట్లు, 1200 సీట్ల సామర్థ్యం గల ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ క్రాస్ రోడ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్‌రామ్‌గూడ, మణికొండ, అత్తాపూర్, రాజేంద్రనగర్ నుంచి తక్కువ సమయంలో ఇక్కడికి చేరుకునే వీలుంది. అంతకుముందు హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు కొత్వాల్‌గూడ వద్ద 85 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఎకో పార్కుకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.