ఒక్క తెరాసను, కేసీఆర్‌ను ఎదుర్కొలేక సిద్ధాంతాలు మరిచి కాంగ్రెస్, భాజపా రెండు జాతీయ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని పురపాలక మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క పైసా కూడా తీసుకురాలేకపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ ఎన్నికలు జరిగినా తెరాస గెలుపు చూసి తట్టుకోలేక పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమర్ రెడ్డి ఎన్నికల వ్యవస్థపైన నమ్మకం లేదనడం హాస్యాస్పదమన్నారు.
ప్రెస్మీట్లు కాదు ప్రజా సమస్యలు పట్టించుకోండి..
అసలు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని గ్రహించాలని మంత్రి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 వందల స్థానాల్లో బీఫారాలు ఇస్తామన్నా ముందుకు వచ్చేవారు ఎవరూ లేరని తెలిపారు. తెరాస సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకెళ్ళి.. ప్రజల గుండెల్లో నిలిచిపోయామన్నారు. ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని తెలిపారు. ఇకనైనా మతాలపై ప్రెస్మీట్లు పెట్టడం కన్నా ప్రజల సమస్యలు గురించి ఆలోచించాలని సూచించారు.
కాంగ్రెస్, భాజపాలపై మంత్రి కేటీఆర్ విమర్శలు ఇవీ చూడండి:అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!