KTR in TRS Plenary: తెలుగువారి దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టారని.. కానీ చరిత్రలో దశాబ్దాల కాలం నిలబడే పార్టీలు నెలకొల్పింది మాత్రం ఎన్టీఆర్, కేసీఆర్‌లు మాత్రమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి హిస్టరీ సృష్టించారని.. కేసీఆర్ హిస్టరీతోపాటు జాగ్రఫీని సృష్టించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారని.. తెలంగాణలో మాత్రం రాష్ట్రాన్ని సాధించిన నేత సీఎంగా ఉన్నారన్నారు. దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో తెరాస పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని కేటీఆర్ ప్రవేశపెట్టారు.
ఏకైక రాష్ట్రం తెలంగాణే:దేశంలో 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన అన్నారు. ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించిన దక్షత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వ్యవసాయ దిగుమతులు.. ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. దేశానికి దార్శనిక నేత కావాలన్న కేటీఆర్.. టెలివిజన్ నాయకుడు కాదు.. విజన్ ఉన్న నాయకుడు కావాలన్నారు. జనహితమే ధ్యేయంగా తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మోదీ రైతు విరోధి:తెలంగాణలో వసూలు చేసిన పన్నులు భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా ఖర్చు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అంతులేని వైఫల్యాల చరిత్ర భాజపాదని విమర్శించారు.ఎండిన శ్రీరామ్‌సాగర్‌కు జలకళ తెచ్చిన నేత కేసీఆర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్.. నరేంద్ర మోదీ రైతు విరోధి అంటూ విమర్శించారు. రైతు బంధు పథకం దేశానికి ప్రేరణగా నిలిచిందన్నారు. నోట్ల రద్దు అపసవ్య ఆలోచన అన్న ఆయన.. నల్లధనం వెనక్కితెచ్చి ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోదీ చెప్పారన్నారు. జన్‌ధన్ ఖాతా తెరవండి...ధన్ ధన్ రూ.15లక్షలు వేస్తామని చెప్పారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.