Minister KTR on paddy: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తన విధానం మార్చుకోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం తేల్చి చెప్పిందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు.. కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రులు గంగుల, మల్లారెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. భాజపా, కాంగ్రెస్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అందుకే వరి వేయొద్దన్నాం..
ఈ ఏడేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నామన్న మంత్రి... భాజపా, కాంగ్రెస్ నేతలు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. యాసంగి సాగుపై తేల్చమని డిమాండ్ చేస్తుంటే కేంద్రమంత్రులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు. ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం తేల్చి చెప్పిందని కేటీఆర్ తెలిపారు. అందుకే తాము రైతులకు వరి వేయొద్దని.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.
కేంద్రం విధానం మార్చుకోవడం వల్లే.. రైతులకు ఈ దుస్థితి: కేటీఆర్ పంజాబ్‌ను దాటాం..
యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మరి మా రైతుల పరిస్థితేంటని ప్రశ్నించాం. మాకు బాయిల్డ్ రైస్ తప్ప వేరే మార్గం లేదు. రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది.. ధాన్యం కొనుగోలు చేయాలని కోరాం. అయినా కూడా కేంద్రం తన వైఖరి మార్చుకోలేదు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. పంజాబ్‌ను దాటిపోయింది. కేంద్రం తన విధానం మార్చుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడింది. అందుకే రైతులకు వరి వేయొద్దని చెప్పాం. -కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
మీరు కొనిపిస్తారా.?
Minister KTR comments over bjp and congress: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తన వైఖరి చెబుతుంటే.. ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రం గగ్గోలు పెడుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేయాలని రైతులను రెచ్చగొడుతున్నారని.. మరి కేంద్రంతో.. రాష్ట్ర భాజపా ఎంపీలు ధాన్యం కొనిపిస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిప్డడారు. ఓ వైపు కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేస్తుంటే.. రూ.10 వేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా 3000 కోట్ల కుంభకోణం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ.. ఆయన అంతు చూస్తామని చెప్పడం సరికాదు. లేనిపోని ఆరోపణలు మాని రాష్ట్రం కోసం ఏం చేస్తారో చెప్పండి. ఎంపీగా ఉన్న బండి సంజయ్.. తెలంగాణ కోసం ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని తెరాస పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాటన్నిటినీ తిప్పికొట్టే బాధ్యత మనందరిపై ఉంది. -కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఇదీ చదవండి:Uttam on Helicopter Crash: 'వీవీఐపీ హెలికాప్టర్‌కు ప్రమాదం జరగడం ఆశ్చర్యంగా ఉంది'