KTR on Uppal Skywalk Inauguration ceremony : హైదరాబాద్ నగరంలోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాలో కాలినడకన రోడ్డు దాటే వారి కోసం ప్రత్యేకమైన స్కైవాక్ అందుబాటులోకి రానుంది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగటం.. చౌరస్తా పెద్దగా ఉండటంతో కాలినడకన రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ వంతెనను ప్రారంభించనున్నారు.
660 మీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ రూ.25 కోట్లు వెచ్చించింది. ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్‌తో ఈ వంతెన అనుసంధానించడం ఓ ప్రత్యేకత. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా దారులు ఏర్పాటు చేశారు. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ నుంచి అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు.
మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు స్కైవాక్ చేరుకోవడానికి అత్యాధునిక ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి సౌకర్యాలు కల్పించారు. ఈ నడక వంతెనతో ఉప్పల్ జంక్షన్ ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ తగ్గి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పనున్నాయని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు, వెడల్పు 3-4 మీటర్లు, 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేశారు. రామంతాపూర్ రోడ్డు, నాగోలు రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్కు, వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్, ఉప్పల్ సబ్ స్టేషన్ ఉప్పల్ జంక్షన్ అనుసంధానంగా నిర్మించిన అందుబాటులోకి రానుంది.
Uppal Skywalk Uses : మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ ద్వారా ప్రతి రోజు సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణీకుల రద్దీ ఉంటుంది. ఇకపై ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణికులు మెట్రో కాన్ కోర్ నుంచి పాదచారుల వంతెన మీదుగా తమ అవసరాలకు అనుగుణంగా వారి వారి గమ్య స్థానాల వైపు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.
ఇవీ చదవండి: