తెరాస మరో 20 ఏళ్లు అధికారంలో కొనసాగుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికలు వచ్చినపుడు రాజకీయాల గురించి ఆలోచించాలని సూచించారు. ప్రజలు విజ్ఞులు.. తప్పకుండా అందరి జాతకాలు రాస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ (ktr in assembly session) అన్నారు. ప్రభుత్వానికి పేరు వస్తుందేమోనని రాష్ట్రాన్ని నిందిస్తున్నారని ఆరోపించారు. సీఎం దృష్టికోణం ఎప్పుడూ దూరదృష్టితో ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రోత్సాహకాలు పారదర్శకంగా ఉన్నాయి. గతంలో నీకెంత, నాకెంత అనే విధంగా వ్యవహారాలు ఉండేవి, ఆ పరిస్థితులు లేవు. 17 వేలకు పైగా పరిశ్రమలను ఆకర్షించగలిగాం, కార్ల పరిశ్రమల కోసం ఇతర దేశాలతో పోటీ పడాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ముచ్చర్ల అవతరించబోతోంది. మన పిల్లలకు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కోరుతున్నాం... కార్పొరేట్ కంపెనీల కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. పరిశ్రమలు ఒకేచోట ఉంటే ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవచ్చు. - కేటీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పరిశ్రమలకు గమ్యస్థానంగా తెలంగాణ
ఉమ్మడి ఏపీలో 35 ఏళ్లలో 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చెందితే... టీఎస్‌ఐఐసీ ఏర్పాటయ్యాక ఆరేళ్లలో 19 వేలకు పైగా పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశామని కేటీఆర్ వివరించారు. అన్ని ప్రాంతాల్లో సమ్మిళిత అభివృద్ధి జరగాలని... ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ విస్తరిస్తామని ప్రకటించారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి పరిశ్రమలకు గమ్యస్థానంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
మూతబడిన వాటిని తెరిపించాం
రామగుండం ఫర్టిలైజర్స్, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాం. సర్ఫేసీ యాక్ట్‌ను విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు. సర్ఫేసీ యాక్ట్ విషయమై ఆర్‌బీఐ గవర్నర్‌ను కలిసి, యాక్ట్ వల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయని చెప్పాం. ఖాయిలాపడిన పరిశ్రమల విషయమై అధ్యయనం జరగట్లేదు. ఖాయిలా పడిన పరిశ్రమల కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి నాలుగేళ్లలో 334 చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం. -కేటీఆర్, మంత్రి
ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందనే లేదు..
రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదు జాతీయ రహదారుల వెంబడి కారిడార్లు పెట్టాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదన్నారు.
ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎంత సంస్కార హీనంగా మాట్లాడినా, ఎబ్బెట్టుగా మాట్లాడినా ప్రజలు విజ్ఞులు. అందరి జాతకాలు ప్రజలే రాస్తారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇట్లాంటి రాజకీయాలు మంచివి కావు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వరంగల్ జిల్లాలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ పెడతామని కేంద్రం మాట ఇచ్చింది. 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించినప్పటికీ.. ఫ్యాక్టరీనీ మహరాష్ట్రకు తరలించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయమా..? కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, ఆదిలాబాద్‌లో గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పసుపుబోర్డు తెస్తామని బాండుపేపర్ రాసిచ్చారు. ఏమైంది..? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుంది. కానీ ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు. రాష్ట్ర శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేసే విధంగా బయట మాట్లాడే మాటలు బాధాకరం. -కేటీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
కట్టుకథలతో పరిశ్రమలు రావు.. కఠోర శ్రమతోనే సాధ్యం: కేటీఆర్ ఇదీ చూడండి:Ktr on jute mills: ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ: మంత్రి కేటీఆర్