Jagdish Reddy review meeting with Electricity Engineers: ఈదురు గాలులతో చెట్లు విరిగి స్తంభాలపై పడడంతో వైర్లు తెగిపడడం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయని.. అటువంటి వాటిపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండటంతో విద్యుత్ శాఖ ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన నష్టాలపై డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనంలో మంత్రి జగదీశ్ రెడ్డి తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒ.అండ్.ఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. ఈదురు గాలులతో వైర్లు తెగిపడితే తక్షణమే సిబ్బంది స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CM KCR Review on Palamuru Irrigation Project: మరోవైపు కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ మొదటి సమీక్ష సమావేశం నిర్వహంచారు. సమీక్షలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం సమావేశం అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తాగునీటి అవసరాల కోసం పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం కూలంకషంగా చర్చించారు.
సమీక్షలో భాగంగా జులై వరకు కరివెన జలాశయానికి నీళ్లు తరలించాలని.. ఆగస్టు వరకు ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నీటిని ఎత్తిపోయాలని అధికారులకు సూచించారు. అందుకోసం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. పంప్ హౌజ్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా సమీక్షించిన సీఎం.. అందులో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.