Harish Rao Review Meeting in Increase Influenza Cases: దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యశాఖ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సహా పలు ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి మంత్రి హరీశ్‌రావుకు అధికారులు వివరించారు. రాష్ట్రంలోనూ స్వల్పంగా కేసులు పెరిగాయని తెలిపారు. ఎక్కువగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఈ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే చిన్న పిల్లల ఓపీ పెరిగిందని.. ఇన్ పేషెంట్లో ఎలాంటి పెరుగుదల లేదని వారు మంత్రి హరీశ్‌రావుకి తెలియజేశారు.
ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి ఆందోళన వద్దు:ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు తెలిపారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే సరిపోతుందని వివరించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
ఇన్‌ఫ్లుయెంజా ప్రధాన లక్షణాలు: జ్వరం, ఎడతెరపి లేని దగ్గు.. దీంతో పాటు వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.