రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు రూ.3 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖను పునర్‌వ్యవస్థీకరించి బలోపేతం చేయనున్నామని, ఈ మేరకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేయనున్నట్లు స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణ నాణ్యత పెంచేందుకు విదేశాల్లో అమలు చేస్తున్న విధానాలు అధ్యయనం చేయనున్నామన్నారు. శనివారం పంచాయతీరాజ్ ఇంజినీర్ల సదస్సులో ఆ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి మంత్రి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని 67 వేల కి.మీ. పంచాయతీ రోడ్లు అద్దంలా మెరవాలి. ఈ మేరకు పనిని విభజించి ఇంజినీర్లకు బాధ్యతలు, అధికారాలు అప్పగించాలి. వరదలో కొట్టుకుపోయిన రహదారులకు ప్రాధాన్యమివ్వాలి. ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. రోడ్ల కోసం రూ.1500 కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంది. దీనికి రెట్టింపుగా ప్రతిపాదనలు రూపొందించాలి’’ అని అన్నారు.
రూ.3 వేల కోట్లతో రహదారుల మరమ్మతులు: మంత్రి ఎర్రబెల్లి - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్
త్వరలోనే రాష్ట్రంలోని రహదారుల రూపురేఖలు మారనున్నాయి. రూ.3 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ముందుగా వరదల్లో కొట్టుకుపోయిన రహదారులకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఇందుకోసం ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ వేయనున్నారు.
ఉపాధి బకాయిలు రూ.110.35 కోట్లు విడుదల చేయాలి:రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీలకు వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. రెండునెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మేరకు వేతన బకాయిలు రూ.110.35కోట్లు విడుదల చేయాలని కోరుతూ శనివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖరాశారు. సెప్టెంబరు 28 నుంచి పనులు చేసిన కూలీలకు రావాల్సిన వేతన బకాయిలు ఈ నెల 19 నాటికి రూ.110.35 కోట్లకు చేరాయని చెప్పారు. గత రెండు నెలలుగా దాదాపు 1.25 కోట్ల మంది ఉపాధి కూలీలకు వేతనాలు రావడం లేదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: