దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister errabelli dayakar rao) తెలిపారు. దీనిపై కాంగ్రెస్, భాజపాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడల కుమార్ గౌడ్, ఇతర ప్రతినిధులు(MPTCS) హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లిని కలిశారు.
గౌరవ వేతనాలు భారీగా పెంచాం
ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవవేతనాలను భారీగా పెంచామని మంత్రి వారికి వివరించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో చాలా తక్కువగా గౌరవ వేతనాలు ఇస్తున్నారని మంత్రి అన్నారు.
బడ్జెట్లో ప్రత్యేక నిధులు
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఐదు, పదిశాతం నిధులను బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నిధులు, అధికారాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల, ఎంపీపీల సమస్యలు, అధికారాలు, నిధుల కేటాయింపు వంటి ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రికి ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ తెలిపారు. మిగిలిన వాటి పరిష్కారం కోసం మంత్రి హమీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సత్యనారాయణ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో(mlc elections) పోటీ చేసేందుకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తెలంగాణ పంచాయతీ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ ఆత్మగౌరవం చంపుకోలేకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ఓట్లు వేసుకునే అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. మా నిరసనను ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశ్యంతోనే బరిలో నిలుస్తున్నట్లు సంఘం నాయకులు వెల్లడించారు. 12 మంది అభ్యర్థుల్లో తెరాస, భాజపా, తెదేపా, కాంగ్రెస్‌ల నుంచి ఉన్నారని ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీల సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని తాయిలాలు ఇస్తానని ఒత్తిడి చేసినాా.. పోటీ నుంచి విరమించుకునే ప్రసక్తే లేదన్నారు.