లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికుల జీవనం అతలాకుతలమవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల కూలీలు ఉండలేక సొంతూరి బాటపడుతున్నారు. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని సుమారు 90 మంది వలస కార్మికులు.. తమ కష్టాలను వెల్లిబుచ్చుతున్నారు.
ఆధార్ లేక ఆరోగ్య కష్టాలు
ఈమె పేరు సంతోషి. ఒడిశా నుంచి కూలి పనుల కోసం భర్త ఎస్‌కే జాంత్‌తో కలిసి నగరానికి వచ్చింది. గర్భిణి కావడంతో ఇంజెక్షన్లు, మందుల కోసం తాము పనిచేసే అపార్ట్‌మెంట్‌కు దగ్గర్లోని అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లింది. ఈ రాష్ట్ర ఆధార్ లేకపోవడంతో అక్కడి వారు ఇంజక్షన్ ఇవ్వలేమన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత లేక... మందుల్లేకుండానే నెట్టుకొస్తున్నట్లు భర్త జాంత్ చెప్పాడు. ‘ఒడిశా నుంచి 160 మంది వచ్చాం. కుటుంబానికి రూ.500 నగదు, 10 కిలోల బియ్యం ఇచ్చి మా బిల్డర్ వెళ్లిపోయాడు. ప్రభుత్వ సాయం అందలేదు’ అని వాపోయాడు.
దొరికిన మాత్రలతో సరి...
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అమీన్‌పూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తాడు. అతడి భార్య స్వప్నకు కీళ్ల జబ్బుంది. ‘ఇంజక్షన్ కోసం ప్రతి వారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లేవాళ్లు. ఇప్పుడు వెళ్లే వీలు లేక, దుకాణంలో అడిగి మందులు తెచ్చి వేస్తున్నారు. వీటితో ఫలితం ఉండట్లేదు’ అని వాపోయాడు. ‘నాకు షుగర్ ఉంది. మందుగోలీలు కొనుక్కోవడం కష్టంగా ఉంద’ని నగరంలో ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ కూలీ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.