కొవిడ్-19 కారణంగా ప్రయాణికుల ప్రాధాన్యక్రమాలు పూర్తిగా మారిపోయాయి. లాక్‌డౌన్‌కు ముందు సమయానికి గమ్యస్థానం చేరడం అన్నింటికంటే ప్రాధాన్యంగా ఉండేది. ఇప్పుడు కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణించడం ముఖ్యమంటున్నారు. వృత్తి, ఉపాధిపరంగా ప్రయాణాలే తప్ప సరదా విహారయాత్రలు వాయిదా వేసుకుంటున్నారు. బస్సు, రైళ్లలో ప్రయాణించాల్సి వస్తే శుభ్రత, శానిటైజేషన్, భౌతిక దూరం తమ ప్రాధాన్య క్రమాలని వేర్వేరు సంస్థలు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడించారు.
నిత్యం ప్రయాణాలు చేసే వారు లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. కొవిడ్-19 విస్తరించకుండా హఠాత్తుగా రవాణాను పూర్తిగా నిలిపేయడంతో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నవారు ఉన్నారు. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశం లేకపోవడంతో ఆంక్షలు సడలించి పరిమితంగా రైళ్లు, బస్సులు తిప్పుతుండటంతో ప్రయాణికుల రాకపోకలు మొదలయ్యాయి. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అంతరాష్ట్ర రవాణా నిబంధనలు వ్యక్తిగత వాహనాల వరకు సడలించడంతో ఇప్పటివరకు వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మనవాళ్లు స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్ ఎత్తివేయగానే తాము మొదటగా ఇంటికి వెళ్లిపోతామని చెబుతున్నారు.