తెలంగాణ

telangana

ETV Bharat / state

అమీర్​పేట- హైటెక్​సిటీకి 'మెట్రో' పరుగులు

సాఫ్ట్​వేర్ నిపుణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్​పేట​- హైటెక్​సిటీ మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. గవర్నర్ నరసింహన్​ అమీర్​పేటలో జెండా ఊపి సేవలను ప్రారంభించారు. ఈ సేవలతో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఈ మార్గంతో ఊరట లభించనుంది.

హైటెక్ సిటీకి మెట్రో పరుగు మొదలైంది

By

Published : Mar 20, 2019, 9:57 AM IST

Updated : Mar 20, 2019, 3:41 PM IST

అమీర్​పేట- హైటెక్​సిటీకి 'మెట్రో' పరుగులు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో నేడు మరో కీలక అడుగు పడింది. గ్రేటర్‌ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న హైటెక్ సిటీ మెట్రో రైలు నేటి నుంచి దూసుకెళ్తుంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఉదయం 9.33 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి హైటెక్‌ సిటీకి తొలి మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్​రెడ్డి, సీఎస్ శైలేంద్ర కుమార్ జోషీ, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అనంతరం మెట్రోలో ప్రయాణించిన గవర్నర్ హైటెక్ సిటీకి చేరుకుని .... అక్కడ స్టేషన్​లోని సౌకర్యాలను పరిశీలించారు. తిరిగి మెట్రోలో అమీర్​పేటకు చేరుకుని అక్కడి నుంచి రాజ్ భవన్​కి రోడ్డు మార్గంలో వెళ్లారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 18 నిమిషాల్లో అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ చేరుకోవచ్చు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రారంభ కార్యక్రమంలో నేతలెవరు పాల్గొనలేదు.

అమీర్ పేట నుంచి ఉన్న మొత్తం పది కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఎనిమిది స్టేషన్లు ఉండగా... అందులో కేవలం ఐదు స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. రైలు వెళ్లిన ట్రాక్ మీది నుంచే తిరిగి వెనక్కి రావాల్సి ఉన్నందున కొన్ని స్టేషన్లలో వాటిని ఆపేందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఒకే కార్డుతో రైలు, బస్సు కారు వంటి సౌకర్యాలను వినియోగించుకునేందుకు వీలుగా సింగిల్​ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

హైటెక్ సిటీకి మెట్రో పరుగు

10 కిలోమీటర్ల దూరం:

ఈ మార్గంలోని రైళ్లు అమీర్​పేట నుంచి మధురానగర్, యూసఫ్​గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటాయి. ఈ రెండు స్టేషన్​ల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

9 నుంచి 12 నిమిషాల మధ్య:

అమీర్​పేట్ నుంచి హైటెక్ సిటీకి 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. మిగతా మార్గాల్లో నాలుగు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటే ఈ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాల మధ్య ఒక రైలు సేవలందించనుంది. హైటెక్ సిటీ వద్ద రివర్సల్ పనులు పూర్తయిన తర్వాత మిగతా మార్గాల మాదిరిగానే 4 నిమిషాలకు ఒక రైలు సదుపాయం కల్పిస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్​బీ నగర్, మియాపూర్ నుంచి వెళ్లేవారు మాత్రం అమీర్​పేట్​లో రైలు మారాల్సి ఉంటుంది. మాదాపూర్​లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.

56 కిలోమీటర్లకు చేరిన మెట్రో మార్గం

హైదరాబాద్​లో మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుతున్నాయి. 29 కిలోమీటర్ల మియాపూర్ - ఎల్​బీనగర్, 17 కిలోమీటర్ల నాగోల్ - అమీర్​పేట మార్గాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్ల అమీర్ పేట - హైటెక్​సిటీ మార్గంలో సేవలు మొదలయినందున మొత్తం 56 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది.

Last Updated : Mar 20, 2019, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details