తెలంగాణ

telangana

ETV Bharat / state

నేనూ కార్మికుడినే.. కష్టమొస్తే మీ వెనకే ఉంటా: చిరంజీవి

Chiranjeevi at Cine May Day Celebrations: రాజకీయాలకతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలని మెగాస్టార్‌ చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాత్రీపగలూ తేడా లేకుండా సినీ కార్మికులు కష్టపడతారన్న చిరంజీవి.. వారి జీవితాలకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ కేవీఆర్‌ మైదానంలో నిర్వహించిన సినీ కార్మికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో రాష్ట్ర మంత్రులు, సినీ పరిశ్రమ పెద్దలు పాల్గొన్నారు. తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

Chiranjeevi at Cine May Day Celebrations
సినీ కార్మిక దినోత్సవం

By

Published : May 1, 2022, 3:39 PM IST

Chiranjeevi at Cine May Day Celebrations: సినీ పరిశ్రమ కోసం ఎంతో మంది తమ కుటుంబాలను త్యాగం చేశారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎన్నో బాధలను దిగమింగుకుని సినిమా కోసం కార్మికులు పనిచేస్తారని పేర్కొన్నారు. సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో సినీ కార్మికోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, విప్లవ కవి, రచయిత గద్దర్‌, సినీ దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

"సినీ కార్మికులందరూ చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదు. ఈ రోజు కోసం నేను అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నాను. నేనూ కార్మికుడినే. ఎవరికి ఏ కష్టమొచ్చినా వారి వెనకే ఉంటా. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం బాధ్యతగా భావించా. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలి. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కావాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చారు." -మెగాస్టార్‌ చిరంజీవి

బయటి కార్మికులకు, సినీ కార్మికులకు చాలా తేడా ఉంటుందని చిరంజీవి అన్నారు. సినీ కార్మికులకు నిర్ణీతమైన సమయం అంటూ ఉండదన్న ఆయన... సెలవులు, పండుగలు అనేది లేకుండా కృషి చేస్తారని తెలిపారు. సినీ కళాకారులు కాదు... సినీ కళా కార్మికులు అని నటుడు రావుగోపాల్ రావు అనేవారని గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమకు నూతన ప్రసాద్ చేసిన త్యాగం ఎప్పటికి మరిచిపోలేనన్న చిరు.. గాయపడిన సందర్భాల్లో కూడా సినిమా కోసం కష్టపడ్డారని తెలిపారు. గుండెల నిండా విషాదం పెట్టుకొని నవ్వులు పంచిన వ్యక్తి అల్లు రామలింగయ్య అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సైతం తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారని పేర్కొన్నారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయన్న కిషన్‌ రెడ్డి.. వ్యాక్సిన్ రావడం వల్ల పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయని చెప్పారు. మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

"దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారు. 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. సంఘటిత రంగ కార్మికులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయి. 45 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు నష్టపోతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నాం. ఈ-శ్రమ్‌ కార్డులు తీసుకుంటే కార్మికులకు ప్రయోజనాల కలుగుతాయి. ఇప్పటికే 28 కోట్ల ఈ-శ్రమ్‌ కార్డులను పంపిణీ చేశాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం 29 కార్మికచట్టాలను 4 చట్టాలుగా మార్చాం." -కిషన్‌ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి

సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఆయన ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని తెలిపారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదన్న ఆయన.. కరోనా సమయంలో వారు చాలా ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చలనచిత్ర పరిశ్రమకు అన్ని విధాలా సహకారమందిస్తున్నామని తెలిపారు.

"సినీ కార్మికుల కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కోసం చిరంజీవి పెద్ద ఆస్పత్రి కట్టాలని భావిస్తున్నారు. చిత్రపురిలో చిరంజీవి ఆస్పత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగంగా ఉంటుంది. చిత్రపురిలోని పాఠశాలలకు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం, మతం లేదు. సినీకార్మికులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తాం. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు నిర్మంచి ఇస్తాం." -తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

కరోనా వల్ల సినీకార్మికులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. షూటింగ్‌లు జరగక సినీకార్మికులకు భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోని సినిమాలు మన వద్ద విడుదలయ్యేవన్న ఆయన.. నేడు మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి వల్లే తెలుగు సినిమాకు విశ్వఖ్యాతి దక్కిందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ బంగారు గని అని పేర్కొన్నారు.

"నా అభిమాన హీరో చిరంజీవి. చిరంజీవి ఆంధ్రా కాదు. తెలంగాణలో ఉన్న సినిమా బిడ్డలంతా తెలంగాణ వాళ్లే. సినీ కార్మికులకు చిరంజీవి మంచి దారి చూపించాలి. ప్రపంచంలోని పెద్ద కంపెనీలు మన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. కార్మికుల అభివృద్ధిలో ఇక నుంచి నేనూ భాగస్వామినవుతా. నేనూ ఓటీటీ సినిమాలు తీస్తా, స్టూడియోలు కడతా. చిరంజీవితో కలిసి సినీకార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతా." -మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

నేనూ కార్మికుడినే.. కష్టమొస్తే మీ వెనకే ఉంటా : చిరంజీవి

ఇవీ చదవండి:May day Celebrations: 'కార్మికుల అడ్డా.. తెలంగాణ గడ్డ'

Rahul Gandhi Telangana Tour: రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ పర్యటన షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details