Meerpet Fight Issue In Bonalu:బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రాజకీయ ఫ్లెక్సీలు ఇరు పార్టీల మధ్య చిచ్చు రగిల్చాయి. ఈ ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో జరిగిన ఇరువర్గాల దాడిలో సాయి వరప్రసాద్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థి వర్గాలు యువకుడిపై బీర్ బాటిల్లు, కత్తులతో దాడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడిలో గాయపడ్డ సాయిని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన సాయి.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు.
అసలు విషయం ఏంటంటే..? బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో బోనాల పండుగ సందర్భంగా రెండు పార్టీల ఫ్లెక్సీలు కట్టడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఫ్లెక్సీల కారణంగా బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట, గొడవ కావడంతో కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్సకు సిబ్బంది నిరాకరించారని.. అనంతరం ఓవైసీ హాస్పిటల్కు తరలించవలసి వచ్చిందని గ్రహించిన మీర్పేట్ పోలీసులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.