అన్నార్థుల ఆకలి తీర్చేందుకు మహానగర పాలక సంస్థ చేపట్టిన "ఫీడ్ ది నీడ్" కార్యక్రమానికి నగరంలోని పలు హోటల్ యజమానులు, స్వచ్ఛంద సంస్థల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. తమ వంతుగా 40 వేల ఆహార పొట్లాలు అందించడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. ఫిబ్రవరి 14న ఈ బృహత్తర కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించనుంది. కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు నుంచి మూడు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని జీహెచ్ఎంసీ తెలిపింది. స్వచ్ఛందంగా అందించే ఈ పదార్థాల్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, ఆటో స్టాండ్లు, మురికివాడలు, ఆసుపత్రులు ఇతర ప్రాంతాల్లో అందించడానికి ప్రణాళికలు రూపొందించారు. "ఫీడ్ ది నీడ్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ కోరారు. ఆహారం అందించాలనుకునే వారు తమను సంప్రదించాలని సూచించారు.