Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర సాధన ఉద్యమం.. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమైనదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేళ వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున కొలువైన అమరుల స్మారక స్థూపం సాక్షిగా త్యాగధనులను గుండెల్లో పెట్టుకుంటామన్న కేటీఆర్.. నాలుగు కోట్ల ప్రజల సేవలో పునరంకితం అవుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రగతిలో అమరవీరుల త్యాగనిరతి ప్రకాశిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నివాళులర్పించారు. కళాకారులు పాడిన తెలంగాణ ఉద్యమ పాటలకు కవిత గొంతు కలిపి చప్పుళ్లు కొడుతూ పాట పాడారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హనుమకొండలో కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికే గర్వకారణంగా నిలిచేలా రాష్ట్రం సాధిస్తున్న ప్రగతే అమరులకు నిజమైన నివాళి అని మంత్రి అభిప్రాయపడ్డారు.
మహబూబాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి అర్పించారు. కలెక్టర్, జెడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కొయ్యగుట్ట చౌరస్తాలొ అమర వీరుల స్థూపానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.