తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక పంచాయతీల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్లు

ఇక నుంచి వివాహ రిజిస్ట్రేషన్​కు సబ్​ రిజిస్ట్రార్​ వద్దకు వెళ్లాల్సిన పని లేదు. పెళ్ళి రిజిస్ట్రేషన్​ గ్రామ పంచాయతీ కార్యదర్శులే చేయనున్నారు. పెళ్లైన దంపతులు, సాక్షులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేస్తే చాలు వివాహ ధ్రువీకరణ పత్రం మీ చేతికొస్తుంది.

పంచాయతీల్లో వివాహ ధ్రువీకరణ

By

Published : Jun 23, 2019, 5:38 AM IST

Updated : Jun 23, 2019, 7:10 AM IST

వివాహ ధ్రువీకరణ పత్రం కావాలంటే వధూవరులు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి వెళ్లి పెళ్లిపత్రికతో సహా తగిన ఆధారాలు చూపించాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి నూతన దంపతులు అంత ప్రయాస పడాల్సిన అవసరం లేదు. వివాహమైన జంట, సాక్షులు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేస్తే చాలు గ్రామ కార్యదర్శి పెళ్లి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. తెలంగాణలో ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో మొదలైన ఈ విధానం త్వరలో రాష్ట్రమంతా అమలు కాబోతుంది.

పంచాయతీరాజ్​ చట్టం

జనన, మరణాలతోపాటు వివాహాల రిజిస్ట్రేషన్లు గ్రామ కార్యదర్శి నిర్వహించాలని నూతన పంచాయతీరాజ్​ చట్టంలో ఉంది. కార్యదర్శులకు ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ సర్కారు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 6,932 విహహాలు నమోదయ్యాయి. వరంగల్​ అర్బన్​ జిల్లాలో అతి తక్కువగా ఆరు పెళ్లిళ్లు నమోదు కాగా నాగర్​ కర్నూల్​లో 1,032 విహహాలు దస్త్రాల్లోకెక్కాయి. పెళ్లిళ్ల వాస్తవ సంఖ్యతో పోల్చినప్పుడు నమోదైన వాటి సంఖ్య చాల తక్కువ. కొందరు కార్యదర్శులు ఈ అంశంపై దృష్టి సారిస్తుండగా, మరికొందరు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు చెబుతున్నారు.

త్వరలో శిక్షణ

వివాహాల రిజిస్ట్రేషన్లు పెంచేందుకు సంకల్పించిన ప్రభుత్వం వీటి పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అప్పగించింది. త్వరలో పంచాయతీ కార్యదర్శులకు వివాహ ధ్రువీకరణ పత్రాల జారీ విధానంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ శిక్షణ ఇచ్చే యోచనలో ఉంది.

ఇవీ చూడండి: అమ్మో అఫ్గాన్​- ఉత్కంఠ పోరులో భారత్​ గెలుపు

Last Updated : Jun 23, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details