రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాగు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకోవడంతో... కర్షకలోకం వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1 కోటి 34 లక్షల 77 వేల 15 ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా... బుధవారం వరకు 72 లక్షల 78 వేల 494 ఎకరాల్లో పూర్తైనట్లు వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన వారాంతం నివేదికలో వెల్లడించింది. ఈ సంవత్సరం నుంచి నియంత్రిత పంట సాగు విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో... వరి, పత్తి, కంది పంటలే సింహభాగం ఆక్రమించాయి. ప్రధాన ఆహార పంట వరి తీసుకుంటే... 27 లక్షల 25 వేల 58 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలన్న నిర్థేశిత లక్ష్యం మేరకు 24 శాతం మేర నాట్లు వేశారు.
ఇంకా జారీ కాని పంట బీమా పథకం
ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటే సాధారణ సాగు విస్తీర్ణం 44 లక్షల 50 వేల 29 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 50 లక్షల 41 వేల 269 ఎకరాల్లో పూర్తయింది. అంటే 113 శాతం వరకు ఎగబాకింది. కంది సాధారణ సాగు విస్తీర్ణం 7 లక్షల 61 వేల 212 ఎకరాలకుగాను ఇవాళ్టి వరకు 98 శాతం ముగిసింది. మరో పంట సోయాబీన్ తీసుకుంటే... 4 లక్షల 88 వేల 753 ఎకరాల్లో సాగైంది. ఇప్పటి వరకు 79 శాతం మేర పూర్తైంది. ప్రకృతి విపత్తుల బారి నుంచి రక్షణ కవచంలా ఉండాల్సిన పంట బీమా పథకం నోటిఫికేషన్ జారీ కాలేదు. ఈ సంవత్సరం అసలు ఈ పథకమే రాష్ట్రంలో అమల్లో లేదు. ఒకవైపు పత్తి విస్తీర్ణం పెరిగింది. గత సంవత్సరాల నోటిఫికేషన్ల ప్రకారం పత్తి తీసుకుంటే జులై 15 నాటికి ప్రీమియం చెల్లింపు గడువు ముగుస్తుంది. కానీ, ఈ ఏడాది ఇక ఈ పథకం అమలు చేయనట్లుగానే భావించాలి. చివరి నిమిషంలోనైనా సర్కారు స్పందించి పత్తి రైతులకు తానే ప్రీమియం చెల్లించి పథకం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతుల విశ్వాసం పొందని పీఎంఎఫ్‌బీవై
గత 30 ఏళ్లుగా పంటల బీమా పథకాలు ఇంకా పైలట్ దశలోనే మిగిలిపోతున్నాయంటే ప్రభుత్వాలకు గ్రామీణ రైతాంగం పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరే కారణం. జాతీయ వ్యవసాయ బీమా పథకం - ఎన్‌ఏఐఎస్ కొంతకాలం అమలైనా... అందులో ఉన్న నిబంధనల వల్ల ఎక్కువ మంది రైతులు బీమా పరిధిలోకి రాలేకపోయారు. మొత్తం రైతుల్లో బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య ఎప్పుడూ 10 శాతం దాటలేదు. పరిహారం పరంగా ఈ పథకం రైతులను పెద్దగా ఆదుకోలేదు. అనేక లోపాలతో నడిచిన ఈ పథకం రైతుల విశ్వాసాన్ని పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో 2016లో నరేంద్రమోదీ సర్కారు దేశవ్యాప్తంగా “ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన - పీఎంఎఫ్‌బీవై పేరిట కొత్త పంటల బీమా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలోనే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం - డబ్ల్యూబీసీఐఎస్ ఒక ప్రత్యేక భాగంగా ఉంది. ఈ రెండు పథకాలకూ మార్గదర్శకాలు రూపొందించిన కేంద్రం ఆడంబరంగా ప్రచారం చేసుకున్నప్పటికీ అంతిమంగా రైతుల విశ్వాసం పొందలేకపోయింది.