AICC Incharge Manikrao Thakre visits Hyderabad : రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేధాలు తొలగించి.. అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్ ఠాక్రే.. నేడు హైదరాబాద్ రానున్నారు. ఇంఛార్జ్ హోదాలో తొలిసారి వస్తున్న ఠాక్రేకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకనున్న కాంగ్రెస్ నేతలు.. గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నరకు గాంధీభవన్ చేరుకోనున్న ఠాక్రే.. నేడు, రేపు రాష్ట్ర నాయకులతో చర్చలు జరపనున్నారు.
తొలుత ఏఐసీసీ కార్యదర్శులతో ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి సహా ఇతర అంశాలపై చర్చిస్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. సీనియర్ నేతలు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చలు జరపనున్నారు. రేపు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలతో.. మాణిక్ రావు ఠాక్రే సమావేశం కానున్నారు. అసంతృప్తులను బుజ్జగించడం, నేతల మధ్య సఖ్యత తీసుకురావడం సహా.. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టేలా సూచనలు చేయనున్నారు.
ఎన్నో సమస్యలు: రాష్ట్ర ఇన్‌ఛార్జీగా బాధ్యతలు చేపట్టిన మాణిక్ రావు ఠాక్రే.. ముందు పలు సవాళ్లు ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నిర్ణయాలతో పలువురు సీనియర్లు విభేధిస్తున్నారు. కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే ఏర్పాటు చేసిన కొత్త కమిటీలపై కొందరు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే కీలక పదవులు ఇచ్చారంటూ ఎమ్మెల్యే సీతక్క సహా సుమారు 12 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు ఇచ్చారు.