Mandous Cyclone in Andhra and Rayalaseema: ఏపీలోని తిరుపతి జిల్లాలో మాండౌస్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెంకటగిరిలో చెవిరెడ్డి చెరువుకు భారీగా నీరు చేరింది. మల్లమ్మ గుడి వీధిలో నివాసాలు నీటమునిగాయి. బొగ్గులమిట్టలో మగ్గం గుంటల్లోకి నీరు చేరింది. ఎన్టీఆర్ కాలనీ, బీసీ కాలనీ, సాలి కాలనీలో చేనేత పనులు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలకు స్వర్ణముఖి నది పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
కాజ్‌వేలపై నీరు పొంగి ఏర్పేడు - సదాశివపురం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తొట్టంబేడు మండలం కొత్త కండ్రికలో ఇళ్లల్లోకి వరద చేరింది. లింగం నాయుడుపల్లి- శ్రీకాళహస్తి రహదారిపై వరదతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రౌతు సూరమాలలో చెరువు కట్టకు గండి కొట్టి నీటిని దిగువకు వదిలారు.
సత్యవేడునియోజకవర్గం వరదాయపాలెంలో శ్రీకాళహస్తి - తడ మార్గంలో సున్నపు కాల్వపై ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోగా...ప్రయాణికులను స్థానికులు కాపాడారు. నారాయణవనం మండలంలో అరుణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరువట్యం, పాలమంగలం ఉత్తరం, తుంబురు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాలాయపల్లి మండలం వెంకటరెడ్డి పల్లి దగ్గర నేరేడువాగు వంతెనపై నుంచి వరద పారుతోంది. వెంకటగిరి - గూడూరు మార్గంలో రాకపోకలు నిలిచాయి. కాళంగి జలాశయం నుంచి దిగువకు వరద వదిలారు.
పుడిసికేపురం - ఎంఏ రాజులకండ్రిగ మధ్య కాజ్ వే కొట్టుకుపోయింది. కడగుంట మినీ వంతెన, నిండలి కాజ్ వే పై కైవల్య నది ప్రవహిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో కైవల్య నది పరవళ్లకు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. దక్కిలి మండలం దగ్గవోలు మార్గంలో లింగసముద్రం వద్ద చెట్లు రోడ్డు మీద పడింది. అధికారులు తొలగించారు. నాయుడుపేట, సూళ్లూరుపేటలో తుపాను ప్రభావంతో వరి నారుమళ్లు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.
అన్నమయ్య జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేల్ మండలాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బొప్పాయి, అరటి, మామిడి తోటలకు నష్టం జరిగింది. బాలుపల్లి చెక్ పోస్ట్ ప్రధాన రహదారిపై శేషాచలం అడవుల నుంచి వచ్చే నీరు.. జలపాతంలా కనిపిస్తూ కనువిందు చేస్తోంది.