ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పెద్దారవీడు చెంచు గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సొంత బావా.. బావమరిది మధ్య రెండు వేల రూపాయలు హత్యకు దారి తీసేలా చేశాయి. చెంచు గిరిజన కాలనీలో చిన్నయ్య అనే వ్యక్తి తన చెల్లిని అదే కాలనీకి చెందిన రాజయ్యకి ఇచ్చి వివాహం చేశారు. ఈ మధ్యనే.. డబ్బులు అవసరం ఉన్నాయంటూ.. బావ దగ్గర రెండు వేల రూపాయలు బదులు తీసుకున్నాడు బావమరిది చిన్నయ్య.
బావకే బాణమేసి చంపేశాడు.. రెండు వేల కోసమే.. - ప్రకాశం జిల్లా క్రైమ్ న్యూస్
పైసా.. పైసా.. ఏం చేస్తావంటే ప్రాణాలు తీస్తానంటుందట. చిచ్చు పెడతానంటుందట.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో అదే జరిగింది. బావా.. బావమరిది మధ్య చిచ్చుపెట్టింది. రెండు వేల అప్పు ఇచ్చినందుకు.. ప్రాణాలు పోయేలా చేసింది. అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడో ఓవ్యక్తి. ఇచ్చిన 2 వేల రూపాయలను తిరిగిచ్చేయమంటే.. అంబు వేసి చంపేశాడు.
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా చిన్నయ్యను అడుగుతున్నాడు రాజయ్య. లాక్ డౌన్ ప్రభావంతో ఇబ్బందులు ఉన్నాయంటూ కచ్చితంగా ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన చిన్నయ్య.. తన బావ రాజయ్యపైకి బాణం వదిలాడు. రాజయ్య పొట్టలోకి బాణం దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం చిన్నయ్య అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం