Mallikarjun Kharge on Woman Declaration : అందరూ కలసి పని చేస్తే తెలంగాణలో విజయం కాంగ్రెస్(Congress) పార్టీదేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో 5 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నామన్న ఆయన.. తెలంగాణలోనూ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్న ఖర్గే.. సొంతవాళ్ల వెన్నుపోటుతోనే గత ఎన్నికల్లో తాను ఓడిపోయనన్నారు.
చేవెళ్ల ప్రజా గర్జన సభలో పాల్గొనడానికి శనివారం హైదరాబాద్కు వచ్చిన మల్లికార్జున ఖర్గే.. ఈ ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని.. నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్లను జనంలోకి తీసుకెళ్లాలని.. మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లను బలంగా రూపొందించాలని ఆదేశించారు.
శనివారం ప్రజా గర్జన సభలోనూ ఖర్గే.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కరి వల్ల రాలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కృషి, సోనియాగాంధి చొరవ వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రసాధనలో.. కేసీఆర్ ఒక్కరే పోరాడినట్లు ప్రచారం చేసుకుని.. క్రెడిట్ పొందారని దుయ్యబట్టారు.