తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతి నరసింహం ఆస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం - అవినీతి నరసింహం ఆస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బంధువుల పేర్లతో కోట్ల విలువ చేసే భూమిని కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ ఆధారాలు సేకరించింది. నర్సింహారెడ్డిని గురువారం అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా... 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

malkajgiri acp narsimhareddy remanded for 14 days
అవినీతి నరసింహం ఆస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం

By

Published : Sep 25, 2020, 4:44 AM IST

అవినీతి నరసింహం ఆస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం

మల్కాజి‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి కేసులో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. సుమారు 70 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన అనిశాకు మరిన్ని ఆధారాలు లభించాయి. బుధవారమే నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు... గురువారం అతడికి సంబంధించిన 2బ్యాంకు లాకర్లలో ఆంధ్రా బ్యాంకు లాకర్‌ను తెరిచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అందులో 300 గ్రాముల బంగారం మాత్రమే లభించింది. ఈనెల 14న లాకర్‌ను ఆపరేట్ చేసినట్లు వెల్లడి కావడం వల్ల ఆ సమయంలోనే సొత్తు ఉపసంహరించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కాల్‌డేటాను బట్టి ఆధారాలు సేకరించే పనిలో అనిశా అధికారులు ఉన్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 55 ఎకరాలకు తోడు భారీగా భూముల్ని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నరసింహారెడ్డి బినామీలను మరింత లోతుగా విచారించడంపై అనిశా దృష్టి సారించింది.

మహిళను బినామీగా ఉంచి..

సోదాల్లో నర్సింహారెడ్డి ఇంట్లో దొరికిన ప్రామిసరీ నోట్లపై అనిశా అధికారులు దృష్టి సారించారు. నర్సింహారెడ్డి వడ్డీ వ్యాపారం చేసి ఉంటాడని అనిశా అనుమానిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారితో గతంలో లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించటంతో అతడితో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యాపారి బంధువు నగరంలోనే ప్రైవేటు ఫైనాన్స్ నిర్వహిస్తుడడం వల్ల అటు వైపు దృష్టి సారించారు. మాదాపూర్‌లో ఉండే మహిళను బినామీగా ఉంచి నరసింహారెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన అనిశా... గురువారం ఆ కోణంలో విచారించింది. ఆమె పేరుతో శంకర్‌పల్లిలో 4ఎకరాల స్థలం కొన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆ మహిళ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ స్థలం నర్సింహారెడ్డిదేనని ఆమె బంధువులతో అధికారులు వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ సీఐగా ఉన్నపుడు వాటర్ ప్లాంట్ వ్యాపారంతోపాటు, పెద్దఅంబర్‌పేట్ వద్ద హోటల్ నిర్మాణం కోసం నర్సింహారెడ్డి 90 లక్షల రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా పుప్పాలగూడలో ఓ మహిళ పేరిట పలు స్థిరాస్తులు కొనుగోలు చేసి వాటిని అభివృద్ది కోసం ఇచ్చినట్లుగా గుర్తించారు.

మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం

ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌తో చంచల్ గూడా జైలులో ఉన్న నర్సింహారెడ్డిని అనిశా మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అతనికి సంబంధిచిన మరో లాకర్‌ను తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: మల్కాజిగిరి ఏసీపీపై వేటు... ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

ABOUT THE AUTHOR

...view details