రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, విమానాశ్రయ ఆవరణలు, ఇతర ప్రాంతాల్లో పర్యాటకుల పట్ల దుష్ప్రవర్తన, దళారీతనాన్ని అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రయాణికులకు ఎదురయ్యే సమస్యలు, సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును రూపొందించారు.
పర్యాటకులకు, ప్రయాణికులకు సురక్షితమైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడటమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. తమ సేవలు తొందరపెట్టడం, ప్రలోభపెట్టడం, సైగలు, ప్రకటల రూపంలో ఉండవని... ప్రయాణికులకు, పర్యాటకులకు అసౌకర్యం కల్పించే వారిపై చర్యలు తీసుకునేందుకే ఈ బిల్లును రూపొందించామన్నారు. సాధారణంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా ఏడాది వరకు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ బిల్లు ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవచ్చు.