తెలంగాణ

telangana

By

Published : Mar 11, 2021, 8:00 PM IST

Updated : Mar 11, 2021, 9:40 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తిన భక్తులు... స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల శివనామస్మరణతో దేవాలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఓంకారుడి దీవెనల కోసం గంటల తరబడి భక్తజనం బారులు తీరారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు దేవదేవుడ్ని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు.

maha shivaratri
maha shivaratri

రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి గంటల తరబడి భక్తులు బారులు తీరారు. శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఓంకారేశ్వర ఆలయం, సారంగాపూర్‌లోని దుబ్బరాజన్న ఆలయంలో శివరాత్రి వేడుకలు కనులపండువగా సాగాయి. స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ ఫలాలతో బిల్వార్చన అభిషేకం చేసి కుంకుమ పూజలు నిర్వహించారు.

గోదావరి తీరంలో పుణ్య స్నానాలు

పెద్దపెల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో పుణ్య స్నానాలాచరించిన భక్తజనం... పిల్లాపాపలతో కలిసి గోదారమ్మకు పసుపు కుంకుమలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రతాపవాడ శివాలయం, బోర్నపల్లి శివాలయాలను మంత్రి ఈటల రాజేందర్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని ప్రసిద్ధ స్వయంభూ రాజేశ్వరస్వామికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రుద్రేశ్వరునికి పాలభిషేకం

హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు... రుద్రేశ్వరునికి పాలభిషేకం చేశారు. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఎత్తు బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శివసత్తులు మల్లన్నకు మొక్కులు చెల్లించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మహబూబాబాద్‌లోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయం నుంచి తరలివచ్చిన భక్తులు

కాజీపేట్ మండలం మడికొండలోని మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. కురవిలోని వీరభద్రస్వామివారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ మాలోత్ కవిత కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో మొక్కులు

మహాదేవుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని శైవక్షేత్రాలు భక్తుల రద్దీతో కళకళలాడాయి. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని సోమేశ్వర ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు... భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొని పూజలు చేశారు.

108 శివలింగాలకు పూజలు

ఖమ్మంలోని సంగమేశ్వరాలయం వద్ద గుంటు మల్లేశ్వరాలయం, ధ్వంసలాపురం శంభులింగేశ్వరాలయం, సుగ్గుల వారి తోట శివాలయాల్లో భక్తులు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. గుంటు మల్లేశ్వరాలయంలో శివలింగానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభిషేకం చేసి... ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కోటిలింగాల శివాలయంలో 108 శివలింగాలకు భక్తులు పూజలు చేయడం ఆనవాయితీ.

భవానిమాతకు మంత్రి హరీశ్​రావు పట్టువస్త్రాలు

భాగ్యనగరంలోని ఆలయాలన్ని భక్తజనంతో కళకళలాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నాంపల్లిలోని శివ ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి బోలాశంకరుడిని దర్శనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం, కేతకీ, సంగమేశ్వర ఆలయాన్ని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానిమాతకు ఆర్థికమంత్రి హరీశ్​రావు పట్టువస్త్రాలు సమర్పించారు.

ఇదీ చదవండి :ఆది దంపతులను చూసైనా మనం నేర్చుకోవద్దూ ?

Last Updated : Mar 11, 2021, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details