రాష్ట్రంలో కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి తాజా పరిస్థితులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారు 100శాతం కోలుకున్నారని....64 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారని ముఖ్యమంత్రి తెలిపారు.
సడలింపులుండవ్..
లాక్‌డౌన్‌లో ఎటువంటి సడలింపులు ఉండబోవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మే 1 వరకూ కొత్త కేసులు వచ్చే అవకాశం ఉన్నందున.. లాక్‌డౌన్ యథాతథంగా అమలు చేస్తామని తెలిపారు. కేంద్రం సడలింపులు సూచించిన నేపథ్యంలో తాము అనేక సర్వేలు చేయించామని... అందరూ లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారని ముఖ్యమంత్రి వివరించారు. మే 7 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
స్విగ్గీ, జొమాటో సేవలు రద్దు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ ప్రమాదకరమన్న ముఖ్యమంత్రి స్విగ్గీ, జొమాటో వంటి సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిత్యావసర సరుకుల సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు.