రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది.
30 శాతం పెరిగిన వేతనాలు
రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరిగింది. ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం రూ. 5 వేల నుంచి రూ.6,500కు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గతంలో సీఎం కేసీఆర్ హామీ
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవవేతనం పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం వారి గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచారు. రాష్ట్రంలో జడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రస్తుతం నెలకు పది వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు.
జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఇక నుంచి ప్రతి నెలా 13 వేల రూపాయల గౌరవ వేతనం అందనుంది. ఎంపీటీసీలు, సర్పంచులకు ఇకపై ప్రతినెలా 6500 రూపాయల గౌరవ వేతనం తీసుకొనున్నారు. ఈ పెంపు జూన్ నెల నుంచి వర్తిస్తుందని.. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.
హరీశ్ రావు ట్వీట్
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
కేసీఆర్కు ఎర్రబెల్లి కృతజ్ఞతలు
గ్రామీణ, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవవేతనం పెంచడాన్ని మంత్రి స్వాగతించారు. పెంచిన వేతనాలు జూన్ నెల నుంచి అమల్లోకి వస్తాయన్న ఆయన.. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు కోత విధించకుండా నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమ అమలులో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఎర్రబెల్లి కోరారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మండలిలో ప్రస్తావించిన కవిత
ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే అధికారం కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. వారికి తగిన ప్రాముఖ్యత కల్పించడానికి అవసరమయితే చట్టసవరణ చేయాలని శాసన మండలిలో విజ్ఞప్తి చేశారు. మినీ అంగన్ వాడీలకు, అంగన్ వాడీ టీచర్లకు ఇచ్చినట్లు వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు కార్యాలయాలు లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో అన్నారు. ఎంపీటీసీలకు గ్రామ పంచాయతీల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:MLC KAVITHA in Mandali: 'ఎంపీటీసీలకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు'