తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి' - Local bodies are responsible for protecting the plants in telangana

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక ప్రజాప్రతినిధులకు స్పష్టమైన లక్ష్యాలు నిర్ధేశించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న వార్డుల్లో మొక్కలు బతికేలా చూడాల్సిన బాధ్యత వారిపైనే మోపింది. కనీసం 85 శాతం మొక్కలు బతకకపోతే ఏకంగా వారు పదవులను కోల్పోయేలా చట్టంలో నిబంధనను పొందుపర్చింది. మేయర్లు, ఛైర్ పర్సన్లతో పాటు కమిషనర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

local-bodies-are-responsible-for-protecting-the-plants-in-telangana
'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'

By

Published : Jan 9, 2020, 5:36 AM IST

Updated : Jan 9, 2020, 8:09 AM IST

పచ్చదనం శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... స్థానిక సంస్థలను కూడా కార్యక్రమంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యుల్ని చేస్తోంది.

హరితహారం కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి పట్టణాలు, గ్రామాల్లో విధిగా మొక్కలు నాటి, సంరక్షించాలని సర్కారు పదే పదే చెబుతోంది. కొన్ని చోట్ల మంచి ఫలితాలు రాగా మరికొన్ని చోట్ల ఆశించిన మేర ప్రయోజనం దక్కలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్త శుద్ధితో పనిచేసిన చోట మంచి ఫలితాలు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే కేవలం భాగస్వామ్యుల్ని చేయడమే కాకుండా బాధ్యత మోపితే ఫలితాలు ఇంకా బావుంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా పారిశుద్ధ్యంతో పాటు పచ్చదనాన్ని స్థానిక సంస్థల విధిగా చేర్చింది.

కలెక్టర్​ అధ్యక్షతన గ్రీన్​సెల్​

ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక చట్టాల్లో అవసరమైన నిబంధనలు పొందు పరిచింది. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీని గ్రీన్ సెల్ పేరిట ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొంది. జిల్లా స్థాయి కమిటీ ద్వారానే మొక్కలు నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆయా జిల్లాల్లో నాటాల్సిన మొక్కల లక్ష్యం, నర్సరీల ఏర్పాటు సహా సంబంధిత బాధ్యతలను జిల్లా కమిటీలకు అప్పగించింది. ప్రత్యేకించి పట్టణాల్లో అందుబాటులో ఉన్న స్థలాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వార్డుల వారీగా ఐదేళ్లపాటు ప్రతి ఏడాది మొక్కలు నాటేలా గ్రీన్ యాక్షన్ ప్లాన్​ను రూపొందించాల్సి ఉంటుంది.

'గ్రీన్​బడ్జెట్​' కోసం ప్రత్యేక నిధులు

నాటాల్సిన మొక్కల లక్ష్యానికి అనుగుణంగా ప్రతి పురపాలికలోనూ అవసరమైన మేరకు నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచాలి. మొక్కల నాటడం, సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ప్రతి పురపాలిక బడ్జెట్​లోనూ పది శాతం నిధులను ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించాలి. ఆయా పట్టణాల్లో ఈ నిధులతోనే నర్సరీల ఏర్పాటు, సంరక్షణతో పాటు మొక్కల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నర్సరీ ఏర్పాటు, సంరక్షణ బాధ్యత ఆయా పురపాలికల ఛైర్​ పర్సన్ లేదా మేయర్​తో పాటు కమిషనర్​పై ఉంటుంది.

85శాతం వరకు మొక్కలు బతకాలి

ప్రతి ఇంటికీ అవసరమైన మొక్కలను ఈ నర్సరీ ద్వారా ఉచితంగా అందించాల్సి ఉంటుంది. వార్డుల వారీగా మొక్కల నాటడం, సంరక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఉంటుంది. ఆయా వార్డుల్లో మొక్కలు నాటడం, సంరక్షణ బాధ్యత సదరు వార్డు సభ్యులపైనే ఉంటుందని చట్టంలో స్పష్టం చేశారు. వార్డులో 85శాతం మొక్కలు బ్రతికేలా చూడాల్సిన బాధ్యత వార్డు సభ్యునిదే. ఇదే తరహాలో నర్సరీ నిర్వహణ, పెరుగుదలకు మేయర్ లేదా ఛైర్ పర్సన్, కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయా పట్టణాల్లో పచ్చదనాన్ని, నర్సరీని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు అవసరమైతే... ఆకస్మిక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయవచ్చు.

మొక్కలు ఎండితే చర్యలే

సంబంధిత వార్డుల్లో 85శాతం కన్నా తక్కువ మొక్కలు బతికినట్టైతే సదరు వార్డు సభ్యులు, ప్రత్యేక అధికారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. వారి అలక్ష్యం, ఉదాసీనత ఉన్నట్టు తేలితే వారి పదవులు, ఉద్యోగాలను కూడా తొలగించే అధికారం కలెక్టర్​కు ఉంటుంది.

Last Updated : Jan 9, 2020, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details