Loan for Telangana State : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం(FRBM) పరిధికి లోబడి రూ. 40 వేల 615 కోట్ల రుణాలు బహిరంగ మార్కెట్లో తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్(Reserve Bank) ద్వారా బాండ్లను వేలం వేసి నిధులు సమీకరించుకుంటోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం, నవంబర్ నెలాఖరు వరకు 38వేల 151 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా సమీకరించుకుంది.
డిసెంబర్ నెలలో మరో రూ. 1400 కోట్లు రుణంగా తీసుకుంది. దీంతో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి రాష్ట్రం రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. చివరి త్రైమాసికంలో కనీసం 13 వేల కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అయితే అప్పు తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.
Telangana Loan From RBI : రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత మేర చెల్లింపులు చేసింది. వడ్డీలతో పాటు అసలు కూడా చెల్లించింది. దీంతో వాటి స్థానంలో కొత్త రుణాలకు అనుమతి ఇస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. చివరి త్రైమాసికంలో రూ. 15 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖను(Central Ministry of Finance) రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసి కొత్త రుణాలు తీసుకుంటారు. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ నుంచి అనుమతి వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.