మద్యం దుకాణాలు ఉదయం 10లోపు తెరిచే అవకాశం లేదు: ఆబ్కారీశాఖ - మద్యం దుకాణాలు సీజ్
16:25 May 11
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్... పదిగంటలవరకు షాపు తెరవరు..!
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో భాగంగా రేపు ఉదయం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడంపై అనుమానంగానే కనిపిస్తుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజా కార్యకలాపాలకు ప్రభుత్వం అవకాశం కల్పించినా బార్, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల లోపు తెరిచేందుకు అవకాశం లేదని అబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అయితే ఉదయం పది గంటలలోపు మద్యం అమ్మకాలకు అనుమతించాలంటే... ముందున్న నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా ఇవాళ్టి రాత్రి నుంచే రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలు, దాదాపు 1,200 బార్‌లు, 15 మైక్రో బ్రూవరేజిలను సీజ్ చేసేందుకు అబ్కారీ శాఖ యంత్రాంగం సమాయత్తం అవుతోంది.
రాత్రి 8 గంటలకు వీటిని సీజ్ చేసేందుకు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా బృందాలుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాలను, బార్ అండ్ రెస్టారెంట్లను సీజ్ చేసే ముందు... నిల్వలను పరిశీలించి బ్రాండ్ల వారీగా ఎంతెంత ఉందో రికార్డులో రాసిన తరువాతనే సీజ్ చేస్తారని అధికారులు తెలిపారు.