రాష్ట్రంలో మద్యం విధానాన్ని సరళతరం చేయటం వల్ల అమ్మకాలు వేగం పుంజుకున్నాయి. గత నెల నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులోకి రాగా... నిన్నటి వరకు రూ.3 వేల 735 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రూ.ఒక వేయి 481 కోట్ల విలువైన 25.40 లక్షల కేసుల లిక్కరు, 31.11 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన అక్టోబరు నెలలో రూ.1,663 కోట్ల విలువైన 27.02 లక్షలు కేసులు లిక్కరు, 38.66 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఈ నెల ఇప్పటికే రూ. 2 వేల కోట్లు...
ఇక ఈ నెల 27వ తేదీ సాయంత్రం వరకు రూ.2,072 కోట్లు విలువైన 34.05 లక్షల కేసుల లిక్కరు, 39.73 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ నెల ముగిసేసరికి అమ్మకాలు రూ. 2500 కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. చలి తీవ్రత పెరగటం వల్ల... మద్యం అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు.