TSRTC Ziva Mineral Water Bottles Launch: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఆ దిశగా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు, లాజిస్టిక్స్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీఎస్‌ఆర్టీసీ.. తాజాగా మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆర్టీసీ సొంత బ్రాండ్ ‘జీవ’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను ప్రయాణికులకు అందించనుంది.
ఈ మేరకు ఎంజీబీఎస్ ప్రాంగణంలో సోమవారం జీవ వాటర్ బాటిళ్లను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మొదట లీటర్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. త్వరలోనే కార్యాలయాల్లో వినియోగించేందుకు 250 ఎంఎల్ బాటిళ్లను, ఏసీ బస్సుల ప్రయాణికుల కోసం అర లీటర్ బాటిళ్లను ఉత్పత్తి చేయనున్నారు.
'ఆర్టీసీ ఏడాదికి 90లక్షల వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తోంది. సుమారు కోటిన్నర రూపాయలు వాటర్ బాటిళ్లకోసం ఖర్చు చేస్తుంది. బయట కూడా వాటర్ బాటిళ్లు విక్రయించాలనే నిర్ణయించింది. ఆర్టీసీ ఇతర ఆదాయ మార్గాలు పెంచుకుంటోంది. కార్గో, పెట్రోల్ బంకులతో ఇప్పటికే ఆర్టీసీకి ఆదాయం. ప్రస్తుతం మినరల్ వాటర్ అమ్మకాలతో ఆదాయం. ఆర్టీసీ టికెటేతర ఆదాయం సమకూర్చుకోవటంపై దృష్టి సారించింది.'-పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి