రెవెన్యూ సేవల్లోనే సరికొత్త అంకం అరంభమైంది. అరగంట వ్యవధిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ విజయవంతమైంది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 570 తహసీల్దారు కార్యాలయాల్లో ధరణి సేవలకు ప్రభుత్వం అనుమతించగా స్లాట్లు నమోదు కాని కార్యాలయాలు మినహా మిగతా అన్నిచోట్లా లావాదేవీలు ప్రారంభించారు. కొత్త చట్టంలో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా ఏక కాలంలో డిజిటల్ సాంకేతికతతో భూ యాజమాన్య హక్కులు కల్పించారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకేచోట, అప్పటికప్పుడు మ్యుటేషన్ పూర్తికావడంపై భూ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.
210 మందికి భూ యాజమాన్య హక్కుల పంపిణీ
ధరణి పోర్టల్ ద్వారా స్లాట్ల నమోదుకు ప్రభుత్వం అనుమతించాక తొలిసారి 825 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య స్లాట్లు కేటాయించారు. సోమవారం కేటాయించిన సమయానికి భూ క్రయవిక్రయదారులు, సాక్షులు తహసీల్దారు కార్యాలయానికి హాజరయ్యారు. కొన్ని స్లాట్లలో కుటుంబ సభ్యుల మధ్య భూమి భాగ పంపిణీ అనంతరం యాజమాన్య హక్కులు, ఇంటి పెద్ద మరణాంతరం వారసత్వ బదిలీ(ఫౌతీ), భూ బహుమతి(గిఫ్ట్ డీడ్) ప్రక్రియలకు రైతులు హాజరయ్యారు. ఈ సేవలను సంయుక్త సబ్ రిజిస్ట్రార్ విధుల్లో భాగంగా రిజిస్ట్రేషన్ నమూనాలో పూర్తిచేశాక తహసీల్దారు విధుల పరిధిలో భూ యాజమాన్య హక్కుల మార్పిడి(మ్యుటేషన్) పూర్తిచేశారు. ఈ రెండు సేవలు పూర్తయేందుకు దాదాపు అన్ని మండలాల్లో కనిష్ఠంగా 30 నిమిషాల సమయం పట్టిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సాంకేతిక సేవలపై పట్టు లేనిచోట మరో పది నిమిషాల సమయం అవసరమైందని తెలిపాయి. అంతిమంగా యాజమాన్య హక్కులు పొందిన రైతులకు పాసుపుస్తకానికి సంబంధించిన నకలు పత్రం అందించారు.
భూ దస్త్రాల నిర్వహణలో కీలక పరిణామం
ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు భూ పరిపాలన, దస్త్రాల నిర్వహణలో కీలక పరిణామంగా నిలుస్తోంది. రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రక్రియల అనంతరం యాజమాన్య హక్కులు పొందాలంటే 2016కు ముందు 40 రోజుల వ్యవధి ఉండేది. దానిని ప్రభుత్వం 10 రోజులకు కుదించింది. తాజా సంస్కరణల్లో భాగంగా ఇప్పుడు అరగంట వ్యవధిలోనూ మ్యుటేషన్ పూర్తవుతోంది. ధరణిలో స్పష్టత ఉన్న భూ ఖాతాలకే ఈ సేవలను ప్రభుత్వం అమలుచేస్తోంది. 2017లో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం(ఎల్‌ఆర్‌యూపీ) అనంతరం 1.45కోట్ల ఎకరాలకు స్పష్టత తీసుకొచ్చారు. ఈ భూములన్నింటికీ ధరణి ద్వారానే సేవలందించనున్నారు.