తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు అభ్యర్థులకు గుడ్​న్యూస్​.. సుప్రీం తీర్పుతో 1,370 మందికి ఊరట

Telangana Police Notification Supreme Verdict: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్‌ భర్తీ ప్రక్రియ కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్‌ లిస్ట్‌లో తొలివరుసలో ఉన్నవారు ఆ పోస్టు తీసుకోకపోతే తర్వాతి వరుసలో ఉన్నవారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీం ధర్మసనం కొట్టేసింది.

Telangana Police Constable
Telangana Police Constable

By

Published : Nov 30, 2022, 10:08 AM IST

Telangana Police Notification Supreme Verdict: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్‌ భర్తీ ప్రక్రియ కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్‌ లిస్ట్‌లో తొలివరుసలో ఉన్నవారు ఆ పోస్టు తీసుకోకపోతే తర్వాతి వరుసలో ఉన్నవారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేస్తూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది.

దీనివల్ల 1,370 మంది అభ్యర్థులకు ఊరట లభించనుంది. వివిధ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం 2018 మే 5వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం పలువురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2019 సెప్టెంబరు 24న తుది మెరిట్‌ లిస్ట్‌ జారీ అయింది. అందులోని వారంతా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు పొందారు. ఇందులో ఎక్కువ అర్హత మార్కులు పొందినవారు ఈ పోస్టుల్లో చేరడానికి రాకపోవడంతో ప్రభుత్వం వాటిని ఖాళీగా ఉంచింది.

అయితే మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్న తమను పరిగణనలోకి తీసుకోలేదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనివల్ల 1,370 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. మెరిట్‌ లిస్ట్‌లో ముందున్నవారు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకొన్న తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఉంటే దాన్ని ఖాళీగా భావించి తదుపరి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం భర్తీ చేయాలి తప్పితే, అసలు అభ్యర్థే చేరని పోస్టును ఖాళీగా ప్రకటించి, దాన్ని మెరిట్‌లిస్ట్‌లో తదుపరి జాబితాలో ఉన్నవారికి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు.

వీరి వాదనతో ఏకీభవించిన హైకోర్టు మెరిట్‌ లిస్ట్‌లో తొలిస్థానంలో ఉన్నవారు చేరని పోస్టులను మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నవారితో భర్తీ చేయాలని ఆదేశించింది. దాన్ని సవాల్‌చేస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేసింది.

ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు మెరిట్‌ లిస్ట్‌లో ఉన్నవారు నియామక ప్రక్రియలో పాల్గొని అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకున్న తర్వాత చేరకపోతే మాత్రమే దాన్ని ఖాళీ అయిన పోస్టుగా పరిగణించాలని, మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి క్రమంలో ఉన్నవారితో భర్తీ చేయాలని ముంజా ప్రవీణ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ కేసులో కోర్టు ఇదివరకే స్పష్టం చేసినందున దాన్నే అనుసరించాలంది. యువత ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్య వనరు అని.., అందువల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details