తెలంగాణ

telangana

ETV Bharat / state

Land Value: పట్టణాల్లో సగం, గ్రామాల్లో నాలుగురెట్లు ఆస్తుల విలువ హెచ్చు! - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలు (land value) భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. మంత్రుల సబ్‌ కమిటీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో... స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. పట్టణాలు, నగరాల్లో వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువ అత్యధికంగా 50 శాతం వరకు, గ్రామాల్లో వ్యవసాయ భూములు... ప్రాంతాలను బట్టి వంద నుంచి నాలుగు వందల శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్‌ విలువులు పెంచడం ద్వారా... నాలుగువేల కోట్లకుపైగా అదనపు రాబడి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ అంచనా వేస్తోంది.

land value hike
land value hike

By

Published : Jun 30, 2021, 2:00 PM IST

Updated : Jun 30, 2021, 4:28 PM IST

కొవిడ్‌ ప్రభావంతో భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని... మరింత పెంచుకోవాలన్న దిశలో రిజిస్ట్రేషన్‌ల శాఖ సమాయత్తమవుతోంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలు (land value) భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల బహిరంగ మార్కెట్‌ విలువకు, ప్రభుత్వ నిర్దేశిత విలువకు భారీ వ్యత్యాసం ఉంది.

2013 నుంచి అవే ధరలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఏప్రిల్‌ ఒకటో తేదీన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు చెందిన మార్కెట్‌ విలువలను అప్పటి ప్రభుత్వం సవరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌ విలువలను పెంచలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో పెంచిన ధరలే ఇప్పటికీ అమలవుతున్నాయి. నాటి విలువలతో పోలిస్తే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల బహిరంగ మార్కెట్‌ విలువ భారీగా పెరిగింది.

అంచనాలు తారుమారు

ఇప్పటికే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చిన ప్రతిపాదనలపై మంత్రుల ఉప కమిటీ చర్చించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్న శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి 2019-20 ఆర్థిక శాఖలో... రూ.6,446 కోట్లు లక్ష్యం కాగా.... 16.78 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసి తద్వారా రూ.7,061 కోట్లు రాబడిని సమకూర్చింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పదివేల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.... కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరువేల కోట్లకు సవరించింది. కానీ అది కూడా రాలేదు.

అదొక్కటే మార్గం

2021-22 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏకంగా రూ.12,500 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పేర్కొంది. నెలకు వెయ్యి కోట్లకుపైగా ఆదాయం వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలకు తగినట్లు రాబడి వస్తుంది. కానీ కొవిడ్​ రెండో దశ ప్రభావంతో... ఏప్రిల్‌, మే, జూన్‌ మూడు నెలల్లో ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం కేవలం రూ.1,324 కోట్లు మాత్రమే. మిగిలిన తొమ్మిది నెలల్లో దాదాపు 1,100 కోట్లకుపైగా రాబడి రావాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య అనూహ్యంగా పెరిగితే తప్ప... లక్ష్యం మేరకు ఆదాయం వచ్చే అవకాశాలు లేవని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి తెచ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌ ఉన్న మార్కెట్‌ విలువల పెంపుతో సాధ్యమవుతుందని భావించి కసరత్తు మొదలు పెట్టింది.

ప్రక్రియ ఎలా అంటే..

సాధారణంగా రిజిస్ట్రేషన్‌ శాఖ మార్కెట్‌ విలువలను పెంచే ముందు అర్బన్‌, గ్రామీణ స్థాయిల్లో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తుంది. మార్కెట్‌ విలువ పెంపు కమిటీల్లో... సబ్‌ రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. అర్బన్‌ ప్రాంతంలో జాయింట్‌ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాలల్లో ఆర్డీవోలు కీలకపాత్ర పోషిస్తారు. ఈ కమిటీలు స్థానికంగా బిల్డర్స్‌, స్థిరాస్తి వ్యాపారులు, నిర్మాణదారులు తదితరులతో సమవేశమై... వారి అభిప్రాయాలను తీసుకుంటాయి. ప్రభుత్వ నిర్దేశిత మార్కెట్‌ విలువ ఎంత... తాజాగా బహిరంగ మార్కెట్లో విలువ ఎంత... ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో తేల్చాలి. వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చిన విధివిధానాలను దృష్టిలో ఉంచుకుని, వాస్తవికత ఆధారంగా ఆయా కమిటీలు మార్కెట్‌ విలువలు పెంపు విషయమై ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఆ తరువాత ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి... ముఖ్యమంత్రి స్థాయిలో తుది నిర్ణయం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

భారీగా పెరగనున్న ఆస్తుల విలువ

2013 నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌ విలువలను పెంచకపోవడంతో... గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 50శాతం వరకు ఆస్తులు, భూముల మార్కెట్‌ విలువ పెరిగే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ఆధారంగా ఇప్పుడున్న మార్కెట్‌ విలువకు రెట్టింపునకు తక్కువ కాకుండా నాలుగు వందల శాతం వరకు పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తోంది. మరో వైపు వాణిజ్య సముదాయాలకు చెందిన డోర్‌ నంబర్లను సేకరించే పనిని కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ చేపట్టింది. ఇప్పటికే వాణిజ్యసముదాయాల డోర్‌ నంబర్లు కొన్ని తమ వద్ద ఉన్నాయని... పూర్తి వివరాలు సేకరించేందుకే సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:అంచనాకు మించి దిగుబడులు.. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు

Last Updated : Jun 30, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details