తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మానియా భూములను కబ్జా చేస్తున్నారు!

తెలంగాణకు తలమానికంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల ఎకరాల్లో విశ్వవిద్యాలయ భూములను కబ్జా చేస్తున్నారు. భూమిని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

land grabbers occupying Osmania University lands in hyderabad
ఉస్మానియా భూములను కబ్జా చేస్తున్నారు!

By

Published : Jan 20, 2021, 6:43 AM IST

వందేళ్ల కిందట ఆవిర్భవించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మిగిలినవి కాపాడే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. 1918లో నిజాం హయాంలో 2,200 ఎకరాలు సేకరించి ఉస్మానియా వర్సిటీ నిర్మించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్‌జీఆర్‌ఐ, దూరదర్శన్‌, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ ఆస్పత్రి, క్రికెట్‌ స్టేడియం తదితరాలకు 573 ఎకరాలు కేటాయించింది. వర్సిటీకి 1627 ఎకరాలే మిగిలాయి.

అధికారుల నిర్లక్ష్యం

అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇందులోని 175 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. వీటిపై ఏళ్లుగా కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నప్పటికీ, వర్సిటీ అధికారులు సరైన ఆధారాలు సమర్పించకుండా తాత్సారం చేస్తున్నారు. 1994లో నియమించిన జస్టిస్‌ చిన్నప్పరెడ్డి కమిటీ వర్సిటీకి చెందిన భూములు ఏ ఒక్క సంస్థకు కేటాయించొద్దని ప్రతిపాదనలు సమర్పించింది. భూములు ఆక్రమణకు గురవుతున్నా, అధికారులు నిస్తేజంగా వ్యవహరిస్తున్నారు.

బోర్డులు పెట్టి పక్కకు..

క్యాంపస్‌ చుట్టుపక్కల భూములను ఇప్పటికీ ఆక్రమించుకుంటున్నా, అధికారులు బోర్డులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. కంచె లేదా ప్రహరీ నిర్మిస్తే కాపాడుకొనే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని ఏబీవీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి ఆరోపించారు. నిధుల లేమిని సాకుగా చూపుతున్నారు. ఆర్టీసీ ఆసుపత్రి, మాణికేశ్వరి నగర్‌ బస్తీ సమీపంలోని భూముల్లో నివాసాలు ఏర్పాటయ్యాయి.

క్యాంపస్‌లోనే బస్తీలు

వర్సిటీ లోపల, బయట 11 బస్తీలలో 3 వేల కుటుంబాలు ఉంటున్నాయి. లోపలున్న 9 బస్తీలను తరలించి రెండు పడక గదులు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినా అమలు చేయలేదు.

లీజులను సమీక్షించరా?

వివిధ దశల్లో వేర్వేరు సంస్థలకు వర్సిటీ తరఫున అప్పట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కారు చౌకగా భూములను లీజుకిచ్చారు. ఎన్‌ఐఎన్‌, తెలుగు భాషా సమితి, సంస్కృత అకాడమీ, ఇఫ్లూ, ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ, ఐపీఈ వంటి 26 సంస్థలకు 183 ఎకరాలు కేటాయించారు. వీటిల్లో కొన్ని సంస్థలకు ఎకరా రూపాయి చొప్పున లీజు నడుస్తోంది. ఈ లీజులను సమీక్షించి ప్రస్తుతం మార్కెట్‌ ధరలకు తగ్గట్టుగా రేట్లు పెంచే విషయంలోనూ వర్సిటీ అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఏబీవీపీ నేత శ్రీహరి ఆరోపించారు. లీజు ధరలు పెంచితే ఆర్థిక ఆసరా లభించే అవకాశమున్నా పట్టించుకోవడం లేదన్నారు.

కేటాయింపులు ఇలా..(ఎకరాల్లో)

* మొత్తం భూమి: 2200

* ఉమ్మడి ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించినవి: 573

* లీజుకు ఇచ్చినవి: 183

* ఆక్రమణకు గురైనవి: 175

* బస్తీల ఆధీనంలో ఉన్నవి: 200

ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం

భూముల ఆక్రమణలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాం. మా దృష్టికి వచ్చిన కబ్జాలను నిరోధించి తొలగిస్తున్నాం. ఇటీవల గవర్నర్‌ సమీక్షలోనూ భూముల విషయంపై నివేదిక అందజేశాం.

- సీహెచ్‌ గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్‌,ఓయూ

ఇదీ చదవండి:వెలుగులోకి హీరో విస్వంత్ మోసాలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details