Land acquisition for RRR: ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఇటీవల ఆమోదముద్ర వేసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా నిర్మించతలపెట్టిన ఈ మార్గానికి ఆమోదం లభించింది. వచ్చే 25 నుంచి 30 సంవత్సరాల ట్రాఫిక్ అంచనాల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు అవతల 338 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వద్ద మార్గంలో మార్పులు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించటంతో 157 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. మూడేళ్లలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. దక్షిణ భాగంలో మార్గం ఖరారు చేసేందుకు అధ్యయనానికి అనుమతి లభించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చౌటుప్పల్- చేవెళ్ల - శంకర్పల్లి - ఆమన్‌గల్ - సంగారెడ్డి మీదుగా 181 కిలోమీటర్ల మార్గానికి జాతీయ రహదారి హోదా లభించాల్సి ఉంది. దీనికి త్వరలోనే కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
భూ సేకరణకు ప్రత్యేక విభాగాలు..
Regional ring road construction: తొలిదశ నిర్మాణానికి వీలుగా భూ సేకరణకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి - భువనగిరి జిల్లాల మీదుగా ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. సుమారు 4 వేల ఎకరాల వరకు భూమిని సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. 3,600 ఎకరాలు రహదారి నిర్మాణం కోసం, మిగిలిన 400 ఎకరాలు వివిధ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి అవసరమవుతుందని అంచనాగా వేస్తున్నారు. పరిహారం ఎంతివ్వాలన్నది తర్వాత ఖరారు చేస్తారని తెలుస్తోంది. భూ సేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని ఇప్పటికే నిర్ణయించాయి.