Regional Ring Road: హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణదిశగా మరో ముందడుగు పడింది. జిల్లాలవారీగా భూసేకరణకు వీలుగా అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు, సిద్దిపేట జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం ఎనిమిది బృందాలు భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. 344 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా రింగు రోడ్డు నిర్మించనున్న విషయం తెలిసిందే.
జాతీయ రహదారి హోదా..
కేంద్ర ప్రభుత్వం 158.50 కిలోమీటర్ల ఉత్తర భాగానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ 161(ఎ)(ఎ) నంబరు కూడా కేటాయించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగరి జిల్లాల పరిధిలోని సంగారెడ్డి- నర్సాపూర్ - తూప్రాన్ - గజ్వేల్ - జగ్దేవ్‌పూర్ - భువనగిరి - చౌటుప్పల్ మీదుగా వెళ్లే ఉత్తర భాగం కోసం 4,760 ఎకరాలు, 12 ప్రాంతాల్లో కూడళ్ల కోసం మరికొంత భూమిని సేకరించాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లోని మలుపుల ఆధారంగా ఎంత వేగంతో వాహనాలు రాకపోకలు సాగిస్తాయన్నది నిర్ధరించాక, కూడళ్లకు ఎంత భూమి అవసరమో అధికారులు నిర్ణయిస్తారు.
వంద మీటర్ల వెడల్పున..