Kunamneni Sambasiva Rao Fire on BJP: 'ఇండియా' పేరుతో ప్రతిపక్షాల కూటమి ఏర్పడటం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. ఇండియా కూటమి ఏర్పడటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు. మునుగోడులో బీజేపీని కమ్యూనిస్టులు నిలవరించడం వల్ల బీఆర్ఎస్కి మేలు జరిగిందని చెప్పారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వకపోతే ప్రమాదంలో పడేదన్నారు. సంతోష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీకి 'ఇండియా' కూటమిని విమర్శించడం సరికాదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని విమర్శించిన పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో చేరాయని ఎద్దేవా చేశారు.
CPI National Leader Chada Venkat Reddy Latest Comments : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ప్రధాని నరేంద్ర మోదీకి ఏర్పడిందని ఆరోపణలు చేశారు. 'సేవ్ ఆర్టీసీ' పేరుతో ఈ నెల 26 నుంచి 31 వరకు అన్ని డిపోల్లోను రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 7న ప్రజా సమస్యలపై అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐ బలమైన స్థానాలను గుర్తించామని.. ఆ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్య విలువలకు పాతరవేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలపైన ఈడీ, సీబీఐ దాడులు చేస్తూ.. భయాందోళనలకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. అధికారాన్ని కోల్పోతామనే భయంతోపోటాపోటీగా ఎన్డీఏ సమావేశం పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.