KTR wrote a letter to youth: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షల కల సాకారమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ సర్కార్.. దేశంలో నవశకానికి నాంది పలికిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 9 ఏళ్ల వ్యవధిలో సుమారు 2లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసిన ఏకైక రాష్ట్రంగా దేశంలో సరికొత్త చరిత్ర లిఖించామన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తోందని.. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీని తొలిసారి విజయవంతంగా పూర్తిచేసినట్లు చెప్పారు.
ప్రజల ఆశీస్సులతో.. మరోసారి అధికారంలోకి వచ్చాక.. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబద్ధతతో వేగంగా చేపట్టామని చెప్పారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీతో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు వచ్చాయని.. అతి త్వరలో గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతో ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే దక్కుతున్నాయన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాము: విద్యార్థులు, యువకుల కోరికమేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వఉద్యోగాలు భర్తీ చేస్తూనే, వివిధశాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే.. మరో 10 వేలమందిని క్రమబద్ధీకరించనున్నట్లు వివరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగసంస్థలు భర్తీ చేసే ఉద్యోగాల నియామక ప్రక్రియపై ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చాయని కేటీఆర్ అన్నారు.