KTR on development of Telangana : పదేళ్లలో తెలంగాణ సమగ్ర, సమతుల, సమ్మిళిత అభివృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలనే స్పూర్తితో పదేళ్లుగా పనిచేసి విజయం సాధించినట్లు తెలిపారు. నూతన వైద్యశాలలు, పాఠశాలలు, గురుకులాల ఏర్పాటు, మనఊరు- మన బడి వంటి కార్యక్రమాలతో విద్య, వైద్య రంగాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందని కేటీఆర్ వివరించారు.
దేశంలో ఎక్కడా లేనంత వేగంగా రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిందని వివరించారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే విధానం నినాదంగా మారిందని తెలిపారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన కేటీఆర్ రాష్ట్రావిర్భావం దినోత్సవం సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
KTR Fires on Opposition Parties : ప్రతిపక్షాలు తొమ్మిదేళ్లుగా పనిలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. విపక్ష నేతలు ఒక్కసారి కూడా హేతుబద్ధంగా, ఆధారాలతో మాట్లాడ లేకపోయారని విమర్శించారు. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల పాలనతో.. తెలంగాణ పరిపాలనను బేరీజు వేసుకోవాలని కోరారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ వివరించారు.
తెలంగాణ కన్నా మంచి మోడల్ ఉంటే చూపాలని కాంగ్రెస్, బీజేపీకి.. కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ రెండు పార్టీలు 75 ఏళ్లుగా చేయని పనిని.. కేవలం 9 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. వారి పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతుంటే.. కేంద్ర మంత్రులు టాయిలెట్లు, రైల్వే స్టేషన్లలోని లిఫ్ట్‌లు ప్రారంభిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇటీవలి విదేశీ పర్యటనలో తెలంగాణ బిడ్డల కోసం 42,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురాగలిగామని కేటీఆర్ తెలిపారు. సచివాలయం నిర్మాణం మొదలుకొని అన్ని విషయాల్లోనూ.. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించడం.. ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ ప్రకియ జాతీయ రహదారుల టెండర్ల మాదిరిగానే జరిగిందని వివరించారు. ఓఆర్‌ఆర్ టెండర్లపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మున్సిపల్ శాఖ ఇప్పటికే ప్రకటించిందని.. లీగల్ నోటీసులు అందుకున్న వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల వద్ద ఆధారాలుంటే కోర్టుకి సమర్పించాలని.. ప్రజల ముందు పెట్టాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
KTR Comments on Congress : తెలంగాణలో బీజేపీ లేనేలేదని.. సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు హంగామా చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తమతో పోటీ పడే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వస్తామన్న భ్రమల్లో హస్తం పార్టీఉంటే వారిష్టమని.. షర్మిల, కేఏ పాల్ లాంటి వారు కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 90 నుంచి 100 స్థానాల్లో సునాయసంగా గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
వచ్చే ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారని.. బీజేపీ, కాంగ్రెస్‌కు ధైర్యముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌లో మంచి పనితీరు ఉన్న ఎమ్మెల్యేల అందరికీ మళ్లీ సీట్లు దక్కుతాయని అన్నారు. అయితే ఈ క్రమంలోనే పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు తమను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.