Ktr Letter On Textile Gst: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 7 శాతం పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను చేనేత శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపై పన్నులేదని, కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటిసారి 5 శాతం విధించిందని.. అప్పుడే చేనేతరంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. తాజాగా దాన్ని 12 శాతం చేయడం సరికాదన్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమపై జనవరి 1 నుంచి జీఎస్టీ పన్ను పెంపు అమలును కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా ప్రభావంతో గడ్డు పరిస్థితులు
Ktr on textile industry:ఇప్పటికే కరోనా ప్రభావంతో టెక్స్‌టైల్, చేనేత రంగాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం పరిశ్రమను చావుదెబ్బ తీయడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అద్భుతమైన చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచిందన్న ఆయన వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపుతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 12 శాతానికి పెంచడంపై.. చేనేత శాఖ మంత్రి కేటీఆర్ అభ్యంతరం జీఎస్టీ మినహాయింపు పెంచాలి
ktr on gst: జీఎస్టీ పెంపుపై ముందుకెళ్లాలనుకుంటే చేనేత, పవర్‌లూమ్ వ్యాపారులకు ప్రస్తుతం ఉన్నట్యాక్స్‌బేస్ జీఎస్టీ మినహాయింపును 20 నుంచి 50 లక్షలకు పెంచాలని కోరారు. తద్వారా లక్షలాది మంది చేనేత వ్యాపారులకు లబ్ది చేకూరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అతి తక్కువ లాభదాయకత, సంక్లిష్టమైన ప్రక్రియ వల్ల కొత్త తరం చేనేత రంగానికి దూరమవుతుందని కేటీఆర్ అన్నారు. 2011 లెక్కల ప్రకారం 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంలో ఉంటే.. తాజా లెక్కల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని లేఖలో వివరించారు. 25శాతం కుటుంబాలు చేనేత పరిశ్రమను వీడిపోయాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో కొద్ది సంవత్సరాల్లోనే చేనేత రంగం అంతర్థానమయ్యే పరిస్థితి ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
"వోకల్ ఫర్ హ్యాండ్ మేడ్"
Vocal for Hand Made:గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించే చేనేతను పరిశ్రమగా కాకుండా దేశ సంస్కృతీ, సాంప్రదాయంగా చూడాలన్నారు. ఆ విషయంలో గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు చేనేత రంగానికి పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం రోజు కేంద్ర టెక్ట్స్‌టైల్ మంత్రి స్వయంగా "వోకల్ ఫర్ హ్యాండ్ మేడ్"అనే నినాదం ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. తద్వారా జాతీయ చేనేత ఉత్పత్తులను రెట్టింపు చేయడం సహా ఎగుమతులు పెంచాలన్న ప్రకటనను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. చేనేత రంగానికి మరింత అదనపు ప్రోత్సాహం ఇచ్చినప్పుడే ఆలక్ష్యం సాధ్యమన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న జీఎస్టీ పన్ను పెంపు స్థూలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేకిన్ ఇండియా నినాదానికి విరుద్ధమని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.