KTR at LB Nagar Today: హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఆధునిక సౌకర్యాలతో ఫతుల్లాగూడలో నిర్మించిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ల ఆదర్శ వైకుంఠధామాలను ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో పెంపుడు జంతువుల కోసం నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించిన కేటీఆర్.. బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు ఎస్ఎన్డీపీ నాలా బాక్స్ డ్రెయిన్‌ను ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు.
అలాగే.. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి ఫిర్జాదిగూడ వరకు లింక్ రోడ్డు ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్రాభివృద్ధి జరగలేదన్న కేటీఆర్.. పటిష్ఠమైన ప్రణాళికతో సాధ్యపడిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ తెరాస అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత హైదరాబాద్ మెట్రోరైల్‌ను హయత్‌నగర్‌కు విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగరం పెరిగుతున్నట్లుగానే అదేస్థాయిలో అభివృద్ధిని చేపట్టనున్నట్లు తెలిపారు.