KTR on development of Hyderabad city : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదగాలంటే బాడీ ఫ్లైఓవర్లు, మెట్రో సౌకర్యాలు, మంచినీళ్లతో పాటు మంచి స్మశాన వాటికలు అవసరమని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో అత్యాధునికంగా అభివృద్ది చేసిన వైకుంఠధామంను మంత్రి ప్రారంభించారు. ఈ వైకుంఠదామ నిర్మాణంలో అనేక ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని మంచి స్మశానవాటిక నిర్మాణం చేశామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల కోసం ఒకేచోట స్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు.
ముఖ్యమంత్రి విజన్‌తో ముందుకు..ప్రజల అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి పనులు ఉండాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన విధంగా ముందుకు వెళ్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో వరద ముప్పు తట్టుకునే విధంగా.. నాలాల అభివృద్దికి 985 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. అదే విధంగా ఆగస్టు 15 నాటికి హైదరాబాద్ నగరంలో మురుగును పూర్తిగా శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందుకోసం 3800 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి ప్రకటించారు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని.. అందులో కొన్నింటిలో చాలా పురోగతిలో ఉన్నాయన్నారు.
త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ.. ప్రజా రవాణాను మెరుగుపరుస్తున్నామని.. ఎయిర్‌పోర్టు మెట్రో పనులు చేపడుతామని ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి వివరించారు. నగరానికి గడిచిన 9 ఏళ్లలో మంచినీళ్లు వచ్చాయి, రోడ్లు బాగా అయ్యాయి, ఫ్లైఓవర్లు పూర్తి అవుతున్నాయన్నారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్ల నిర్మాణం పూర్తయిందని.. నాలుగు నెలల్లో వాటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.