తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమయమొచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు.. యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి' - KTR Latest News

KTR Fires On BJP: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము ఏం మాట్లాడినా వక్రీకరిస్తారని చెప్పారు. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సందర్భానుసారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయని కేటీఆర్ తెలిపారు.

KTR Fires On BJP
KTR Fires On BJP

By

Published : Oct 29, 2022, 2:59 PM IST

Updated : Oct 29, 2022, 5:30 PM IST

సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు: కేటీఆర్‌

KTR Fires On BJP: మునుగోడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో కొనాలనుకుంటున్న భాజపాపైన ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఛార్జ్‌షీట్‌లో నిర్దిష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు చేసినట్లు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలో ఉన్న పార్టీ చేసిన పనులు చెప్పాలి. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు. దివాళాకోరు రాజకీయాలను మునుగోడు ప్రజలు హర్షించరు. మునుగోడులో అసాధారణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మేం ఏం చేశామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. గెలిస్తే చేయబోయే పనులు కూడా చెబుతున్నాం. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మునుగోడును అనాథలా వదిలేశాడు. కేంద్రంలో ఉన్న భాజపా మునుగోడులో ఏం చేసింది? భాజపా వ్యక్తిగత నిందారోపణలు చేస్తోంది. భాజపాను ఎండగట్టేందుకే ఛార్జ్‌షీట్‌ తీసుకొచ్చాం.

జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్‌ కేంద్రాన్ని పెడతానన్నారు. ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం భాజపా ఏమీ చేయలేదు. ఫ్లోరోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయలేదు. ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్తులను అనాథలుగా చేసింది. చేనేత, ఖాదీ ఉత్పత్తులపై పన్ను విధించిన మొట్టమొదటి ప్రధాని మోదీ. మోటార్లకు మీటర్లు పెట్టాలనే దుర్మార్గపు కుట్ర చేసింది భాజపా. తెలంగాణను విద్యుత్‌ సమస్యల వలయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. సిలిండర్‌ ధర రూ.1100 దాటింది. పెట్రోలు ధర పెంపుతో దిగువ, మధ్యతరగతి, పేదల నడ్డి విరిచారు. ముడిచమురు ధర పెరగకపోయినా మోదీ ధర పెంచేశారు. పెట్రో ధరల పెంపుతో ఉప్పు, పప్పులు, బియ్యం, నూనె ధరలు పెరిగాయి. పేదల సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని భాజపా చూస్తోంది. నల్లధనం విషయంలో తెల్ల ముఖం వేశారు. జన్‌ధన్‌ ఖాతాల విషయంలో మధ్య తరగతి కుటుంబాల తరఫున ఛార్జ్‌షీట్ వేస్తున్నాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ అన్ని విషయాలు చెబుతారు:‘‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ స్పందించారు. ‘‘మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి సందర్భానుసారంగా సీఎం కేసీఆర్‌, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మేం మాట్లాడబోయేది లేదు. తొందరపడొద్దని మా పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించాను. సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే పోలీసులెందుకు? దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు ఇప్పటికే అర్థమైంది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఆలయంలో సంప్రోక్షణతో ప్రక్షాళన చేయాలి..: మరోవైపు యాదాద్రి నరసింహస్వామిపై బండి సంజయ్​ ప్రమాణంపైనా కేటీఆర్ స్పందించారు. రేపిస్టులకు దండలు వేసి ఊరేగింపుగా తీసుకువచ్చే భాజపా నేతలు చేసే ప్రమాణాలు, విమానాలకు ఏ విలువ ఉంటుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమ పాత్ర లేదంటూ నిన్న బండి సంజయ్ యాదాద్రిలో చేసిన ప్రమాణంపై ఆయన ఈ విధంగా స్పందించారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో తాకితే దేవుడు మలినమవుతాడన్న కేటీఆర్.. ఇలాంటి పాపాలకు వేదపండితులు ఆలయంలో సంప్రోక్షణతో ప్రక్షాళన చేయాలని కోరారు.

ఇవీ చదవండి:'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. రెండు వేర్వేరు తీర్పులు

కోటి మంది కలిసి ఒకేసారి గానం రికార్డు సృష్టించిన కన్నడిగులు

Last Updated : Oct 29, 2022, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details