KTR Comments on Congress : తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. వివిధ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. మరోవైపు పార్టీలు సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో కూడా నేతలు యాక్టివ్‌గా ఉంటూ ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నోటిఫికేషన్‌కు ముందే పథకాల అమలు జరగాల్సి ఉందని.. ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ కార్యక్రమాలకు వాడుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. అధికారులు బీఆర్ఎస్‌కు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేటీఆర్ తిప్పికొట్టారు.
KTR Tweet On Congress Today : ఇంటింటికి తాగునీరు, 24గంటల విద్యుత్ ఆపేయమంటారేమో.. అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా? అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ హస్తం పార్టీ అని ఇంకోసారి తేలిపోయిందని ఆరోపించారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కాంగ్రెస్ కుట్రను.. రైతులు సహించరని పేర్కొన్నారు.
అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల హస్తం పార్టీ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కర్షకులు భరించరని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కత్తిరిస్తామని విమర్శించారు. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి... కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే.. ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారని కేటీఆర్ ధ్వజమెత్తారు.